ఆపద ముంచుకొస్తున్నపుడు పక్కవారి గురించి కూడా పట్టించుకోకుండా తమను తాము రక్షించుకునే వారెందరో..
- విధి నిర్వహణలో ఉన్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
- ప్రయాణికులను రక్షించి, ప్రాణాలు విడిచిన డ్రైవర్
నల్లగొండ క్రైం: ఆపద ముంచుకొస్తున్నపుడు పక్కవారి గురించి కూడా పట్టించుకోకుండా తమను తాము రక్షించుకునే వారెందరో.. అలాంటి వారికి విరుద్ధంగా ఓ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సమయ ‘స్ఫూర్తి’తో వ్యవహరించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చినా లెక్క చేయకుండా బస్సును రోడ్డు పక్కన నిలిపి 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను మాత్రం ప్రాణాలొదిలాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొడ్డు జానయ్య(36) స్థానిక ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
మంగళవారం ఉదయం 5:30 గంటలకు నల్లగొండ డిపో నుంచి 30 మంది ప్రయాణికులతో బస్సు దేవరకొండకు బయలు దేరింది. మార్గమధ్యలో నల్లగొండ శివారు వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లగానే జానయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. అమ్మా అంటూ ఓ చేత్తో ఛాతీని అదిమి పట్టుకుంటూనే సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. కండక్టర్‌తో గుండెలో నొప్పి వస్తుందంటూనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే 108 అంబులెన్స్‌లో నల్లగొండ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.