సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్ మాజీ ఎమ్మెల్యే పప్పు కలానీకి సెషన్స్ కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఉల్లాస్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కలానీపై సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు కోర్టు తీర్పు వెలువరించడంతో అతని రాజకీయ భవితవ్యం అయోమయంలో పడింది. కోర్టు తీర్పు వ్యక్తిగతంగా కలానీకే కాకుండా ఎన్సీపీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసు నేపథ్యం ఇదీ...
బోగస్ ఓటింగ్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన ఘనశ్యాం భతీజాను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 1990లో హత్య చేశారు. అయితే ఈ హత్యను పప్పు కలానీ చేయించాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసులో ప్రధాన సాక్షి, ఘనశ్యాం సోదరుడు ఇందర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే సోదరుడి హత్య జరిగిన మరుసటి రోజే(ఏప్రిల్ 28, 1990) ఇందర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇందర్ అక్కడికక్కడే మరణించాడు.
ఘనశ్యాం హత్య నేపథ్యంలోనే ఇందర్ హత్య కూడా జరిగిందని భావించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కిందిస్థాయి కోర్టులన్నింటినీ దాటుకుంటూ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పప్పుపై సుప్రీంకోర్టు టాడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి టాడా కేసు నుంచి పప్పు విముక్తి పొందినా ఇందర్ హత్యపై విచారణ జరపాలని సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరిపిన సెషన్స్ కోర్టు పప్పు కలానీతోపాటు అతని నలుగురు అనుచరులను దోషులుగా నిర్ధారిస్తూ జీవితఖైదు శిక్షను విధిస్తూ ఏప్రిల్ 3, 2013లో తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పప్పు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా కిందిస్థాయి కోర్టు విధించిన తీర్పును ఖరారు చేస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.
బరిలో ఉండారా? లేదా?
నాలుగేళ్లకు మించి జైలుశిక్ష పడినవారంతా ఎన్నికల బరిలో నిలిచేందుకు అనర్హులుగా మారుతున్న నేపథ్యంలో జీవితఖైదు శిక్ష పడిన పప్పు ప్రస్తుత ఎన్నికల బరిలో ఉండారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై ఎన్నికల సంఘం ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
పప్పు కలానీకి జీవితఖైదు
Published Wed, Oct 15 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement
Advertisement