Pappu Kalani
-
పప్పు కలానీకి జీవితఖైదు
సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్ మాజీ ఎమ్మెల్యే పప్పు కలానీకి సెషన్స్ కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఉల్లాస్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కలానీపై సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు కోర్టు తీర్పు వెలువరించడంతో అతని రాజకీయ భవితవ్యం అయోమయంలో పడింది. కోర్టు తీర్పు వ్యక్తిగతంగా కలానీకే కాకుండా ఎన్సీపీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసు నేపథ్యం ఇదీ... బోగస్ ఓటింగ్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన ఘనశ్యాం భతీజాను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 1990లో హత్య చేశారు. అయితే ఈ హత్యను పప్పు కలానీ చేయించాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసులో ప్రధాన సాక్షి, ఘనశ్యాం సోదరుడు ఇందర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే సోదరుడి హత్య జరిగిన మరుసటి రోజే(ఏప్రిల్ 28, 1990) ఇందర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇందర్ అక్కడికక్కడే మరణించాడు. ఘనశ్యాం హత్య నేపథ్యంలోనే ఇందర్ హత్య కూడా జరిగిందని భావించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కిందిస్థాయి కోర్టులన్నింటినీ దాటుకుంటూ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పప్పుపై సుప్రీంకోర్టు టాడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి టాడా కేసు నుంచి పప్పు విముక్తి పొందినా ఇందర్ హత్యపై విచారణ జరపాలని సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరిపిన సెషన్స్ కోర్టు పప్పు కలానీతోపాటు అతని నలుగురు అనుచరులను దోషులుగా నిర్ధారిస్తూ జీవితఖైదు శిక్షను విధిస్తూ ఏప్రిల్ 3, 2013లో తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పప్పు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా కిందిస్థాయి కోర్టు విధించిన తీర్పును ఖరారు చేస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. బరిలో ఉండారా? లేదా? నాలుగేళ్లకు మించి జైలుశిక్ష పడినవారంతా ఎన్నికల బరిలో నిలిచేందుకు అనర్హులుగా మారుతున్న నేపథ్యంలో జీవితఖైదు శిక్ష పడిన పప్పు ప్రస్తుత ఎన్నికల బరిలో ఉండారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై ఎన్నికల సంఘం ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
మాజీ ఎమ్మెల్యే కలానీకి యావజ్జీవం
సాక్షి, ముంబై: ఘనశ్యాం భతీజా హత్య కేసులో ఉల్హాస్నగర్ మాజీ ఎమ్మెల్యే సురేశ ఎలియాస్ పప్పూ కలానీ సహా మరో ముగ్గురికి మంగళవారం కల్యాణ్ సెషన్స్ కోర్టు యావజ్జీవశిక్ష ఖరారు చేసింది. రాజకీయ కక్షల వల్లే కలానీ 1990 ఫిబ్రవరి 27న ఠాణే జిల్లాలోని పింటో రిసార్ట్స్ వద్ద ఘన భతీజాను హతమార్చాడని పోలీసులు ఆరోపించారు. ఈ హత్యతో కలానీతోపాటు మరో ఐదుగురు సహచరుల ప్రమేయమున్నట్లు గుర్తించారు. గత శుక్రవారం ఈ కేసుపై తుది విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి బాపట్ కలానీతోపాటు ఆయన అనుచరులు బాబా గాబ్రియల్, బచ్చీపాండే, అర్షద్ షేక్‌ను దోషులుగా నిర్ధారించడం తెలిసిందే. సరైన సాక్ష్యాలు లేకపోవ డంతో నరేంద్ర రామ్సింఘానీ, రిచర్డ్ ఫెర్నాండెజ్ అనే ఇద్దరిని ఆమె నిర్దోషులుగా విడుదల చేశారు. కలానీపై ఇది వరకే టాడా వంటి అనేక కేసులు నమోదయ్యాయి. వాటి నుంచి విముక్తి లభించినప్పటికీ తన సహచరులతో కలిసి 1990లో ఘనశ్యాం భతీజాను హత్య చేశాడు. ఈ ఘటనకు ప్రధానసాక్షి, ఘనశ్యాం సోదరుడు ఇందర్‌ను కూడా 1999లో హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలానీకి ఉరి శిక్ష ఖరారు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయమూర్తి ఈ మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని కలానీ వకీలు దీపక్ మిశ్రా చెప్పారు. ఇదిలాఉండగా జైలులో ఉంటూనే 1990 నుంచి కలానీ నాలుగుసార్లు ఉల్హాస్నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇతడికి ఎన్సీపీ అధిష్టానం అండ ఉండడంతో అప్పట్లో ఎవరూ ఎదురించలేదని చెబుతారు. కాలక్రమేణా ప్రతిపక్ష నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇతనికి కష్టాలు మొదలయ్యాయి. కలానీకి జీవిత ఖైదు శిక్షపడడంతో కల్యాణ్-ఉల్లాస్‌నగర్ ప్రాంతాల్లో ఎన్సీపీకి గట్టి దెబ్బ తగిలిందని భావిస్తున్నారు.