ఏడుగురు అవినీతి అధికారులపై లోకాయుక్త పంజా | Seven officials of corruption, Lokayukta paw | Sakshi
Sakshi News home page

ఏడుగురు అవినీతి అధికారులపై లోకాయుక్త పంజా

Published Fri, Sep 27 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

Seven officials of corruption, Lokayukta paw

బెంగళూరు, న్యూస్‌లైన్ : అవినీతిపరులపై లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. బెంగళూరు, బీదర్, గుల్బర్గ, బాగల్‌కోటె, దావణగెరెలలోని ఏడుగురు అధికారుల నివాసాలు, కార్యాలయాలపై గురువారం వేకువ జామున ఏక కాలంలో సోదాలు ప్రారంభించింది. వారి వద్ద  రూ.7.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించామని లోకాయుక్త ఏడీజీపీ హెచ్‌ఎస్. సత్యనారాయణరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఇక్కడి లోకాయుక్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...
 
= రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ వ్యక్తిగత కార్యదర్శిసిద్ధప్ప బాళప్ప అథణి బాగలకోటెలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయంలో, మంత్రి ఇంటిలోని కార్యాలయంలో సోదాలను నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 
= బీదర్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్‌ఎస్. సావళగికి చెందిన బీదర్ కాళిదాస నగరలోని  నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
 
= గుల్బర్గ జిల్లా చించోళిలోని సీనియర్ ఆరోగ్య శాఖాధికారి సిద్ధన్న పాటిల్ నివాసంలో కూడా విస్తృతంగా సోదాలను నిర్వహించారు.
 
= కర్ణాటక గృహ నిర్మాణ మండలి బీదర్ చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్న టీ. మల్లన్న ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 
= బిజాపుర నిర్మిత కేంద్రం ఏఈఈగా పని చేస్తున్న గోపీనాథ్ మజగికి చెందిన హొన్నాకట్టిలోని ఫామ్‌హౌస్, ఇల్లు, కార్యాలయా ల్లో కూడా సోదాలు జరిగాయి.
 
= బెంగళూరులోని కేఐఏడీబీ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న హెచ్‌వీ. ఓంకారమూర్తి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
 
= ఎగువ భద్ర పథకం అసిస్టెంట్ ఇంజనీరు సేవా నాయక్‌కు చెందిన దావణగెరెలోని కార్యాలయంతో పాటు అక్కడి సర్వసతి లేఔట్‌లోని నివాసంలో,  సోదాలు జరిగాయి.

 ఆయా జిల్లాలో లోకాయుక్త ఎస్పీల ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఒకే సారి సోదాలు నిర్వహించారని సత్యనారాయణ రావు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం అక్రమ ఆస్తుల విలువ లెక్కగట్టినా, ఇంకా లాకర్లు, బంగారు నగలు, విలువైన వస్తువులను పరిశీలించాల్సి ఉంది. గోపీనాథ్ మగజి రూ.1.75 కోట్లు, సిద్ధన్న పాటిల్ రూ.98 లక్షలు, ఎస్.ఎస్. సావళగి రూ.95 లక్షలు,  సేవా నాయక్ రూ.89 లక్షలు, సిద్ధప్ప బాళప్ప అథణి రూ.85 లక్షలు, హెచ్.వీ. ఓంకారమూర్తి రూ.81 లక్షలు, టీ. మల్లన్న రూ.64 లక్షల అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement