‘షాహీ’ స్నానానికి సిద్ధమైన గోదావరి
సాక్షి, ముంబై : ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు మన సంస్కృతి సంప్రదాయాల సంగమంగా పేర్కొనే గోదావరి నదీ సింహస్త కుంభమేళాలో భాగంగా శనివారం మొదటి షాహీ స్నానం జరగనుంది. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు జూలై 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉత్సవాల్లో కీలక ఘట్టం అయిన తొలి షాహీ స్నానం శ్రావణ పౌర్ణమి శనివారం జరగనుంది. ఇప్పటికే లక్షలాది భక్తులు, అఖాడాలు, సాధువులు నాసిక్, త్రయంబకే శ్వర్‌కు చేరుకున్నారు. షాహీ స్నానానికి విచ్చేసే వారి కోసం నాసిక్‌లో దాదాపుగా 350 ఎకరాల్లో, త్రయంబకేశ్వర్‌లో 17 ఎకరాల్లో సాధుగ్రామ్‌లను ప్రభుత్వం నిర్మించింది.
భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగ్ర దాడులు జరగొచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 24 వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. నాసిక్ చుట్టుపక్క ప్రాంతాల్లో 20 వరకు పార్కింగ్ జోన్‌లు సిద్ధం చేసింది. నాసిక్ లోని రోడ్లన్నింటినీ శుక్రవారం సాయంత్రం నుంచే మూసేశారు. ఇక మొత్తం ఘాట్లనన్నింటినీ రూ.2,500 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాల వెలుగులో గోదావరి మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది.
రోడ్ల వివరాల కోసం వెబ్‌సైట్
కుంభమేళా తొలి షాహీ స్నానం నేపథ్యంలో వాహనాల పార్కింగ్, మూసివేసిన రోడ్లు, వెళ్లాల్సిన మార్గాలు వంటి వివరాల కోసం ప్రభుత్వం ఓ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. ‘ఎంఐటీ కుంభయాన్’ తరఫున http://tiny.cc/roadnashik అనే వెబ్‌సైట్‌లో రోడ్లకు సంబంధించిన వివరాలను మ్యాప్‌లతో సహా పొందుపరిచారు. ‘నో వెహికల్ జోన్, మోటర్‌సైకిళ్ల కోసం ప్రత్యామ్నయ మార్గాలు, నగరం వెలుపల, లోపల ఉన్న పార్కింగులు తదితరాలన్ని వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యుద్దీపాల వెలుగుల్లో ఘాట్‌లు
షాహీ స్నానం నేపథ్యంలో నాసిక్, త్రయంబకేశ్వర్‌లు మిలమిల మెరిసిపోతున్నాయి. రామ్‌కుంద్, గోదాఘాట్ పరిసరాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అహల్యబాయి హోట్కర్ వంతెన నుంచి రామ్‌కుంద్, ఏక్‌ముఖి దత్త మందిరం, రామ్‌సేతు, గాడ్గే మహారాజ్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
24 గంటల హెల్ప్‌లైన్
కుంభమేళా నేపథ్యంలో 24 గంటలపాటు నిరంతరాయంగా సేవలందించే హెల్ప్‌లైన్‌ను అధికారులు ప్రారంభించారు. ఐసీఐసీఐ బ్యాంకు సహాయంతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో దాదాపు 70 మంది సిబ్బంది దాకా పనులు నిర్వహిస్తున్నారు.
షాహీ స్నానాల వివరాలు
ఆగస్టు 29 : తొలి షాహీ స్నానం
సెప్టెంబరు 13: రెండో షాహీ స్నానం
సెప్టెంబరు 18: మూడో షాహీ స్నానం
సెప్టెంబరు 25: వామన్ ద్వాదశి స్నానం
హెల్ప్‌లైన్ నెంబర్లు: 08390300300, 18002339985, 0253-2226100, 0253-6642300