శాంతి
టీ.నగర్: తిరుచ్చి జిల్లాలో 11వ సారిగా గర్భం దాల్చిన మహిళ ఇంట్లోనే ప్రసవానికి పట్టుబట్టింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను గురువారం బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు.. తిరుచ్చి, ముసిరి దిగువవీధికి చెందిన కన్నన్ (50) కార్మికుడు. ఇతని భార్య శాంతి (45). వీరికి గీత, ఉదయకుమారి, కృత్తిక, సుబ్బులక్ష్మి (12), పూజ అనే ఐదుగురు కుమార్తెలు, కార్తీక్ (20), ధర్మరాజ్ (13), దీపక్ (8) అనే ముగ్గురు కుమారులున్నారు. శాంతికి ఇద్దరు పిల్లలు జన్మించి మృతిచెందారు. గీత, ఉదయకుమారి సహా ముగ్గురు కుమార్తెలకు వివాహమై వారికి పిల్లలున్నారు. ఇలాఉండగా శాంతి ప్రస్తుతం 11వ సారి గర్భం దాల్చింది.
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తారని..
ఆమెకు ఇంట్లో వైద్యపరీక్షలు జరుపుతున్న గ్రామీణ నర్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందాల్సింది గా కోరింది. ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించింది. శాంతి అక్కడ తనకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స జరుపుతారని, అందుచేత అక్కడికి రానని ఖరాఖండిగా తెలిపేది. తనకు ఇంట్లోనే 10 సార్లు సుఖ ప్రసవం అయిందని, అలాగే ఈ సారి కూడా ఇంట్లోనే ప్రసవిస్తానంది. తిరుచ్చి జిల్లా వైద్య బృందం ఆమెను ముసిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహించగా ఆమెకు రక్తహీనత ఉన్నట్లు తెలిసింది. గురువారం రక్తం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసిన వైద్యబృందం ఆమె కోసం ఇంటికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఆమె కావేరి నది దాటి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.. దీంతో ఆమెపై ఆరోగ్యసిబ్బంది ముసిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాంతిని ముసిరి ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కారులో తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment