ఇక టార్గెట్‌ శశికళ | Shashikala, Dinakaran's expulsion decision | Sakshi
Sakshi News home page

ఇక టార్గెట్‌ శశికళ

Published Sat, Aug 12 2017 5:09 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

ఇక టార్గెట్‌ శశికళ

ఇక టార్గెట్‌ శశికళ

విలీనం దిశగా వైరి వర్గాలు
శశికళను సాగనంపేందుకు సన్నాహాలు
అనుచరులతో దినకరన్‌ బిజీ బిజీ
దినకరన్‌ ఓ 420 అని ఎద్దేవా చేసిన ఎడపాడి
అవసరమైతే అవిశ్వాస తీర్మానం: స్టాలిన్‌


సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇద్దరికీ ఒకరే శత్రువైన పక్షంలో మనమిద్దరం మిత్రులమైనట్లే’ అనే రాజకీయ సూత్రాన్ని సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అక్షరాల పాటించడం ప్రారంభించారు. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను పార్టీ నుంచి గెంటివేసిన ఎడపాడి తరువాతి బాణాన్ని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై ఎక్కుపెట్టారు. విలీనం అంశంలోని ప్రధాన డిమాండ్లలో ఒకటైన శశికళ బహిష్కరణను నెరవేర్చడం ద్వారా పన్నీర్‌సెల్వంతో దోస్తీ కుదుర్చుకునే దిశగా ఎడపాడి పళనిస్వామి పావులు కదుపుతున్నారు.

‘అమ్మ’ లేని అనాథగా మారిన అన్నాడీఎంకేను బీజేపీ అక్కున చేర్చుకుంది. శశికళ కుటుంబమంటే సహించని ప్రధాని మోదీ ముందుగా పన్నీర్‌సెల్వంను చేరదీయగా, ఆ తరువాత ఎడపాడి కూడా చేరువయ్యారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి అన్నాడీఎంకే మినహా మరే మార్గంలేని బీజేపీ ఎడపాడి, పన్నీర్‌లకు అన్నిరకాల అండదండలు ఇస్తోంది. ఎడపాడి వద్దనున్న ఎమ్మెల్యేల బలం, పన్నీర్‌ వద్ద ప్రజాబలం ఏకమైతే తమ ఆశయాలు నెరవేరుతాయని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే ఎడపాడి, పన్నీర్‌ వర్గాల విలీనంపై బీజేపీ పట్టుబడుతోంది.

విలీనం అంశం ముందుకు వెనక్కు సాగుతుండగా, అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో దినకరన్‌  19 మంది ఎమ్మెల్యేలు సహా 59 మందికి పార్టీ పదవులను పందేరం చేశారు. అంతేగాక కొంతమందిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. దినకరన్‌ వైఖరి సీఎం ఎడపాడికి మరింత ఆగ్రహం తెప్పించింది. దినకరన్‌ పదవే ప్రశ్నార్థకంగా మారినవేళ ఆయన నియామకాలు చెల్లవని ఎడపాడి ప్రకటించారు. అంతేగాక శశికళ, దినకరన్‌లను ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శిగా తాము ఆమోదించడం లేదని సీఎం ప్రకటించడంతో విలీన అంశం వేగంగా ముందుకు వెళ్లింది.

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గురువారం రాత్రి వేర్వేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం విడివిడిగా ప్రధానిని కలుసుకుని శశికళ, దినకరన్‌ల బహిష్కరణ నిర్ణయం తదితర తాజా పరిణామాలను వివరించినట్లు సమాచారం. అంతేగాక విలీన ముహూర్తంపై ఇరువర్గాల నేతలు ఢిల్లీలో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

విలీనం కాగానే పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళను బహిష్కరిస్తున్నట్లుగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి చట్టపరమైన చిక్కులు ఏర్పడకుండా ఎడపాడి వర్గీయులు నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా దినకరన్‌ను సీఎం ఎడపాడి 420 అని విమర్శించడంపై పార్టీలో అగ్గిపుట్టింది. 420 అనే పదానికి దినకరన్‌ అక్షరాల అర్హుడని సీఎం ఎద్దేవా చేశారు.  ఇందుకు దినకరన్‌ తీవ్రంగా స్పందిస్తూ పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేందుకు వెనుకాడనని ఎడపాడిని హెచ్చరించారు.

ప్రధాన కార్యదర్శి పదవిపై దీప డిమాండ్‌:
అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితుల నుంచి అన్నాడీఎంకేను చక్కబెట్టేందుకు ప్రధాన కార్యదర్శి పదవికి వెంటనే ఎన్నిక జరపాలని అన్నాడీఎంకే జే దీప అధ్యక్షురాలు దీప శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు.                

దినకరన్‌ సన్నాహాలు
ఇదిలా ఉండగా, పార్టీ తన చేతుల్లో నుంచి జారిపోకుండా టీటీవీ దినకరన్‌ తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. తన వెంట నడుస్తున్న 17 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎడపాడికి వ్యతిరేకంగా దినకరన్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. దినకరన్‌ బలమేంటో త్వరలో మేలూరులో జరగబోయే సభలో నిరూపిస్తామని సవాల్‌ చేశారు.

అవసరమైతే అవిశ్వాస తీర్మానం: స్టాలిన్‌
ప్రభుత్వం, అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ శుక్రవారం పార్టీ జిల్లా ఇన్‌చార్జి్జలతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement