నుపూర్ శర్మ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో బతుకుతున్న వలస కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకంపనలు ముందుగా కువైట్‌లో మొదలయ్యాయి.
నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపిన విషయం విదితమే. దీనిపై గల్ఫ్ దేశాధినేతలు తమ అభిప్రాయాలను భారత రాయబారులకు తెలిపారు. ఖతార్ లాంటి దేశాల్లో భారత వస్తువులను నిషేధించాలనే దాక వ్యవహారం వెళ్లింది. ఇంతలో భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే గల్ఫ్ దేశాలు తమ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడంలో విఫలం కావడంతో భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి.
నుపూర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ గల్ఫ్ దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఏమవుతుందో ఏమో అనే భయంతో కొందరు, నుపూర్ వ్యాఖ్యలను నొచ్చుకున్న మరికొందరు వలస కార్మికులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు. నినాదాలు వినిపించారు.
ఇప్పుడు ఇలా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వలస కార్మికులను కువైట్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అక్కడి చట్టాల ప్రకారం వలస కార్మికులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదంటూ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వలస కార్మికులను వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించి వేస్తామంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు వారు భవిష్యత్తులో కువైట్‌లో పని చేసుకునే అవకాశం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న వలస కార్మికులను గుర్తించే పని మొదలెట్టింది.
కువైట్‌లో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే వీరిలో భారతీయులే అధికం. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలస కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పులు చేసి అక్కడికి చేరుకున్న వారిని ఉన్న పళంగా వెనక్కి పంపిస్తే వారి కుటుంబాలు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment