
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే విషయంలో మొదట వెనక్కి తగ్గిన కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యువల్‌కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది.
తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్‌లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్‌లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్లు పైబడిన వలస కార్మికులు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరీలోని కార్మికులు కాస్త ఊరట చెందారు.
సీనియారిటీ ఉన్న వలస కార్మికులకు రూ.50 వేలకు మించి వేతనాలు ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం సూచించిన ఫీజు చెల్లిస్తే నెల నుంచి 40 రోజుల వేతనం ఖర్చు చేస్తే సరిపోతుందని వలస కార్మికులు భావించారు. కువైట్‌లోని ఆయిల్ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, మాల్స్ ఇలా ఎన్నో రంగాల్లో 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. ఇందులో డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన వలస కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యువల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment