► 11 మంది కమిటీకి హైకోర్టు చెక్
► నియామకం రద్దు
►కోర్టు ఆదేశాలతో సంకటంలో సర్కారు
తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. 11 మందితో కూడిన సభ్యుల కమిటీకి చెక్ పెట్టింది. దివంగత సీఎం జయలలిత హయాంలో నియమితులైన ఈ కమిటీని రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, చెన్నై :రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎన్పీఎస్సీ) గుర్తించి, వాటి భర్తీకి పోటీ పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది. 2011లో దివంగత సీఎం జయలలిత అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శరవేగంగానే సాగిందని చెప్పవచ్చు. పోటీ పరీక్షల ద్వారా టీఎన్ పీఎస్సీ ప్రతి ఏడాదికి వేలాది పోస్టులను భర్తీ చేసింది. ఈ కమిషన్ కు చైర్మన్ లుగా గతంలో పనిచేసిన వాళ్లల్లో ప్రస్తుతం నవనీత కృష్ణన్ అన్నాడీఎంకే ఎంపీగా, ఆర్.నటరాజ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కమిషన్ కు చైర్మన్ గా డాక్టర్ కే అరుల్‌మొళి దేవన్ వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కూడా పోటీ పరీక్షలు విజయవంతంగానే సాగాయి. అన్నాడీఎంకే సర్కారుకు విధేయులుగా ఉన్న వాళ్లకే ఇక్కడ పదవులు. ఆ దిశగా ఈ కమిషన్ కు 11 మంది సభ్యులను జనవరి 31వ తేదీన నియమించారు.
దివంగత సీఎం జయలలిత ఆదేశాలతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ జాబితాను సిద్ధం చేసి రాజ్‌భవన్ కు పంపించారు. ఇందుకు అప్పటి గవర్నర్ రోశయ్య ఆమోద ముద్ర కూడా వేశారని చెప్పవచ్చు. 11 మంది సభ్యుల్ని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆరేళ్ల పాటుగా ఆ పదవిలో వీళ్లు కొనసాగేందుకు తగ్గ మార్గం సుగమం అయింది. ఆ పదవుల్లో నియమితులైన వాళ్లందరూ అర్హత లేని వారుగా న్యాయవాది బాలు కోర్టును ఆశ్రయించారు. అలాగే, ఆ కమిటీకి వ్యతిరేకంగా పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, డీఎంకే అధికార ప్రతినిధి, ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ వేర్వేరుగా పిటిషన్ లు కోర్టులో దాఖలు అయ్యాయి. అన్నాడీఎంకే సర్కారుకు విదేయులుగా ఉన్న వాళ్లను ఆ కమిషన్ కు సభ్యులుగా నియమించి ఉన్నారని, వీరికి ఎలాంటి అర్హతలు లేవు అని, అన్నాడీఎంకే తరఫున న్యాయవాదులుగా వ్యవహరించిన వాళ్లు, ఆ పార్టీ న్యాయవాద విభాగంలో సభ్యులుగా ఉన్న వాళ్లకు పదవుల్ని కట్టబెట్టి ఉన్నారని, ఈ కమిషన్ సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను ప్రధానన్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తూ వచ్చింది. టీఎన్ పీఎస్సీ తరఫున వివరణలు ఇచ్చుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినా ఫలితం శూన్యం.
టీఎన్ పీఎస్సీకి సభ్యులుగా నియమితులైన 11 మంది ఆర్ ప్రతాప్‌కుమార్, వి.సుబ్బయ్య, ఎస్.ముత్తురాజ్, ఎం.సేతురామన్, ఏవీ.బాలు స్వామి, ఎం మాడస్వామి, వి.రామమూర్తి, పి.కృష్ణకుమార్, జె. సుబ్రమణియన్, ఎన్పీ. పుణ్యమూర్తి, ఎం.రాజారాంలకు ఆ పదవుల్లో కొనసాగేందుకు తగ్గ అర్హతలు లేనట్టు కోర్టు విచారణలో తేలింది. దీంతో 11 మంది నియామకాన్ని రద్దు చేస్తూ గురువారం న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా జయలలిత అధికారంలో ఉన్న సమయంలో నియమించిన కమిటీని కోర్టు రద్దు చేయడం టీఎన్ పీఎస్సీలో చర్చకు దారి తీసింది.