ఇంకా కళ్ల ముందే...
ఇంకా కళ్ల ముందే...
Published Thu, Dec 12 2013 11:25 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగి సుమారు ఏడాది కావస్తున్నా ఆ క్రూర ఘటన నుంచి మృతురాలి తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను అతిక్రూరంగా పొట్టనపెట్టుకున్న నిందితులందరినీ ఉరి తీసినప్పుడే తమకు కాస్త మనశ్శాంతి కలుగుతుందని వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘సమయం గడిచిపోతోంది. ఆమె గాయాలు, ఆక్రందనలు ఇంకా తమ మదిలో తాజాగానే ఉన్నాయి. దాని నుంచి ఇప్పటివరకు బయటపడలేకపోతున్నామ’ని మృతురాలైన పారా మెడికల్ విద్యార్థిని తండ్రి బద్రీ సింగ్ పశ్చిమ ఢిల్లీ ద్వారకాలోని తన నివాసంలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఈ భవనంలోకి నాలుగు నెలల క్రితమే నిర్భయ కుటుంబం మారింది.
చదువులోనే కాక క్రీడల్లోనూ ముందుండే తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందనుకునేలోపే ఈ ఘటన జరగడం ఎంతో కలచివేసిందని నిర్భయ తండ్రి అన్నారు. తన కూతురు బతుకు ఇంత దారుణంగా ముగుస్తుందని ఏనాడూ ఊహించలేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఇంటి తలుపు పక్కనే ఉండి నాన్నా అని ఆప్యాయంగా పిలిచేదని, ఆ రోజులను తలచుకుంటే ఎంతో బాధగా ఉందని తెలిపారు. డెహ్రాడూన్‌లో ఫిజియోథెరపీ చదివిన నిర్భయ ఢిల్లీ ఆస్పత్రిలో ట్రైనీగా పనిచేసిందన్నారు. ‘ప్రతిసారి ఆమె జ్ఞాపకాలే కళ్ల ముందు కదలాడుతున్నాయి. మా వరకు ఇప్పటికీ బతికి ఉన్నట్టే అనిపిస్తోంది. సమయం చూసుకోవడం లేదు. ప్రతిసారి తలుపు వెనకాలే ఉండి అకస్మాత్తుగా కనిపించకపోదా అని అనుకుంటున్నాన’ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోర్టర్‌గా పనిచేసే 54 ఏళ్ల బద్రీ సింగ్ తెలిపారు.
నిందితులందరినీ ఉరి తీసిన రోజే తమకు సంతృప్తి కలుగుతుందన్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 16న కదులుతున్న ఓ ప్రైవేట్ బస్సులో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఓ జువెనైల్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అడ్డు వచ్చిన ఆమె స్నేహితుడిని కూడా తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వీరిద్దరిని రోడ్డుపైకి తోసేశారు. రోడ్డుపై గంటపాటు నిస్త్రాణంగా ఉన్న ఆమెను చూసి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 13 రోజుల పాటు ఢిల్లీలో బతుకుతో పోరాడిన ఆమె సింగపూర్‌కు తరలించగా అక్కడ మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన పెల్లుబికింది. అనేక మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.
ఆ సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. అత్యాచారం చేసిన నలుగురు నిందితులకు ఉరిశిక్షే సరైందని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 13న ఇచ్చిన తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు. ఐదో వ్యక్తి అంతకుముందే జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన మైనర్‌ను బాలనేరస్తుల గృహంలో మూడేళ్ల పాటు ఉంచాలని జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయంపై నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరతామని తెలిపారు. నిర్భయ తల్లి మాట్లాడుతూ కొన్ని గంటల్లో తిరిగి వస్తానని చెప్పిన నిర్భయ ఆ తర్వాత తిరిగి ఇంటికే రాలేదన్నారు. ఈ నెల 16న నిర్భయ స్మారక కార్యక్రమం నిర్వహించాలని యోచిస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement