Delhi gang rape
-
‘నిర్భయ’ను మించిన దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి రెండ్రోజులుగా..!
గాజియాబాద్: బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ(40)ను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్ ఇంకా మహిళ మర్మాంగాల్లోనే ఉందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది బాధితురాలు. ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని గాజియాబాద్ ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజియాబాద్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మలివాల్ ఎస్పీని కోరారు. ‘ ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలోనూ ఇనుప రాడ్డు అలాగే ఉంది. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్ ఎస్ఎస్పీకి నోటీసులు పంపించాం’అని ట్వీట్ చేశారు శ్వాతి. ఇదీ చదవండి: స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం -
ఢిల్లీలో మరో నిర్భయ ఉదంతం.. ముగ్గురి అరెస్టు
సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న 25 ఏళ్ల మహిళను కారులో అపహరించిన ముగ్గురు వ్యక్తులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో పీవీఆర్ ప్రియా థియేటర్లో సినిమా చూసి, స్నేహితురాలితో కలిసి తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను అపహరించారు. కారులో తనపై ముగ్గురూ అత్యాచారం చేసి, ఆ తర్వాత పూర్వీమార్గ్ వద్ద విసిరేసి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె కిడ్నాప్ కాగానే ఆమెతోపాటు ఉన్న స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. కారు నెంబరును ఆమె గుర్తుపెట్టుకోవడంతో నిందితులను పట్టుకోవడం సులభమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించగా అత్యాచారం జరిగిన విషయం కూడా నిర్ధారణ అయ్యిందన్నారు. -
ఆ బాల నేరస్తుడిని ఇప్పుడే వదలరట!
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్(నిర్భయ) ఘటనకు సంబంధించిన బాల నేరస్తుడిని ఇప్పుడే విడుదల చేయడం లేదని సమాచారం. అతడిని ఒక ఏడాదిపాటు ఓ స్వచ్ఛంద సంస్థ కస్టడీలో ఉంచనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.అతడి విడుదలపట్ల ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వెలిచుచ్చడంతోపాటు భిన్న వర్గాల నుంచి కూడా ప్రతికూల స్పందన వస్తుంది. ఓ రకంగా చాలామంది ఈ విషయానికి సంబంధించి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతడిన జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది తమ పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. తమ కూతురుపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిపింది ఆ నేరస్తుడేనని కోర్టు కూడా పేర్కొందని, అలాంటివాడిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖకు, కోర్టులకు, మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. 'ఇది సామాన్యంగా ఆలోచించాల్సిన విషయం కాదు.. పోలీసులు సరిగా పనిచేయాల్సిన సమయం' అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నేరస్తులకు హక్కులు ఉండవని వారు పేర్కొన్నారు. అతడి వల్ల సమాజానికి మా కుటుంబంలాగే అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో అతడిని మరో ఏడాదిపాటు అక్కడే పోలీసుల సమక్షంలో ఉంచనున్నట్లు తెలిసింది. 2012 డిసెంబర్ నెలలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై ఆరుగురు వ్యక్తులు పాశవిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె చనిపోయింది. ఆ సమయంలో ఈ బాలనేరస్తుడికి 18 ఏళ్ల లోపు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 21. -
కదులుతున్న కారులో నైజీరియన్‌పై గ్యాంగ్‌రేప్
దేశ రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. 35 ఏళ్ల నైజీరియన్ మహిళపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని డీఎన్డీ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 2.45 గంటల సమీపంలో ఆమె స్పృహలేకుండా పడి ఉంది. టోల్‌ప్లాజా సిబ్బంది గమనించి పోలీసులకు చెప్పడంతో వాళ్లు ఆమెను అక్కడకు సమీపంలోని ఎల్వీఎస్ ఆస్తత్రికి తరలించారు. టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలలోని ఫుటేజి ఆధారంగా హ్యుందయ్ ఎసెంట్ కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ వద్ద ఆమెను కారులో ఎక్కించుకుని అరగంటలో టోల్ ప్లాజా వద్దకు తీసుకొచ్చారు. వాళ్లంతా 22- 25 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. 2014 సంవత్సరంలో ఢిల్లీలో 2069 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. -
దోషులకు శిక్ష పడేనా.. బాధితులకు న్యాయం జరిగేనా?
న్యూఢిల్లీ: అది డిసెంబర్ 16, 2012 దేశాన్ని కుదిపేసిన దుర్ఘటన. భారత్ కీర్తిప్రతిష్టలు మంటగలిపిన రోజు..దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రపంచ దేశాలు భారత్‌లో మహిళల దుస్థితి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.. ఆ రోజు రాజధాని నగరవీధుల్లో బస్సులోనే 23 ఏళ్ల మహిళా ట్రైనీ ఫిజియోథెరపిస్టుపై ముష్కరులు అత్యంత కిరాతకంగా సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ దుస్సంఘటన చోటు చేసుకొని రెండేళ్లు పూర్తి అయ్యింది. సంఘటన తీరు ఒక ఎత్తై ఇప్పటికీ దోషులకు మరణశిక్ష విధించినకోర్టు. ఇప్పటికీ అమలు చేయలేదు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇంకా తాత్సారం జరుగుతూనే ఉంది. ఇంకా మహిళలపై దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి.. విచారణలో జాప్యమిలా.. మార్చి, 2014 వరకూ ఆపెక్స్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీన్ని పూర్తి చేయడానికి ఇంకా కాలయాపన చేస్తోంది. ఇంతలోనే నేరస్తులు తమ మరణశిక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది ‘తమ కేసు ఇంకా సమగ్రంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. బాధిత కుటుంబం ఇంకా ఎదురు చూడక తప్పడం లేదు. సమగ్రంగా విచారణ చేయాలి ‘ఈ కేసు త్వరగా పూర్తికావాల్సిందే. కానీ విచారణ సమగ్రంగా జరగాలని ఆశిస్తున్నా. ఇందులో న్యాయ ఒక వైపే జరగాలని చూడడం లేదు. తాను బాధితులకు, న్యాయానికి వ్యతిరేకం కాదు. అమాయకులకు శిక్ష పడకూడదనే నా వాదన’ అని నేరస్తులు ముఖేష్, పవన్ తరఫు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. అమాయకులైన తమ కక్షిదారులను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. వాళ్లు అమాయకులని తెలుసు, రుజువు చేయగలను. కోర్టు విచారణ నిష్పక్షతంగా సాగడం లేదు. తొందరపాటు చర్యలకు పాల్పడుతోంది. ఇంకా సమయ కావాలి’ అని అంటున్నారు. ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సెప్టెంబర్ 13, 2013న నిందితులైన ముకేష్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను నేరస్తులుగా పరిగణిస్తూ మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. సామూహిక లైంగిక దాడి, హత్య, దోపిడీ, అమానవీయ సంఘటనలకు పాల్పడ్డారన్న వివిధ నేరాలపై వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మార్చి 13, 2013న మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి 15, 2014న ముకేష్, పవన్ గుప్తా తరఫు న్యాయవాదులు తమ కక్షిదారులకు క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పరిశీలనకు స్వీకరించడంతో వారితోపాటు జూలై 14 మరో ఇద్దరి నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ శిక్షలను కూడా వాయిదా వేసింది.కానీ, తమ కక్షదారులు అమాయకులని సుప్రీంకోర్టు ముందు వారి తరఫు న్యాయవాదులు వాదించారు. విచారణ సమగ్రంగా జరుగలేదని, రాజకీయ నాయకులు, ప్రజల ఒత్తిడి కారణంగా జనవరి 21, 2013 లో కేసు విచార ప్రారంభమైందని,ఈ కారణంగా మరణ శిక్షను అంగీకరించేది లేదని, సమగ్ర విచారణ జరుపాలని కోరారు. సంఘటన ఇలా.. నగరంలో కదులుతున్న బస్సులోనే ఆ యువతిపై మొత్తం ఆరుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దుండగులు బాధితురాలుతోపాటు ఆమె స్నేహితుడిని తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలిని బస్సు బయటకు నెట్టివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 29న, 2012న మృతి చెందింది. ఈ కేసులో మైనర్ బాలుడిని మూడేళ్లపాటు సంస్కరణ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ కేసులో మిగతా నలుగురిపై విచారణ సమగ్రంగా జరగకుండానే కేసును తొందరంగా మూసివేయాలనే ఆతృతతో కోర్టు వ్యవహరిస్తోంది. తమ వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని నేరస్తుల తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. అంతేకాదు నలుగురిపై సామూహిక లైంగిక దాడి కేసుతోపాటు, దోపిడీ, దాడి తదితర కేసులపై విచారణ సాగుతోందని చెప్పారు. ఈ కేసులో సాక్షం రికార్డు దశలోనే ఉన్నది. గ్యాంగ్ రేప్ జరిగి బస్సు యజమానిపై చీటింగ్ కేసు ఉంది. కాబట్టి మరికొంత సమయం ఇచ్చి, సమగ్ర దర్యాప్తు జరపాలని, అమాయకులైన తమ కక్షిదారులకు విముక్తికల్పించాలని న్యాయవాది కోరుతున్నారు. బాధిత కుటంబానికి న్యాయం జరగడం లేదు. ఇంకా కాలయాపన సాగుతోంది. నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలి: బాధితురాలి తండ్రి ‘తమ కూతురుపై ఇంత దాష్టీకానికి ఒడిగట్టిన నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలని తపిస్తున్నారు. అంతేకాదు, శిక్షలో జాప్యం కారణంగా నేరగాళ్లలో ఇంకా భయం పుట్టలేదు. ఇంకా మహిళల పట్ల ఇలాంటి నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టాలంటే తమ కూతురు జీవితాన్నిబుగ్గిపాల్జేసిన నేరగాళ్లకు తక్షణమే శిక్ష అమలు చేయాలని డిసెంబర్ 16 ఘటన బాధితురాలి తండ్రి ఈ వ్యవస్థను నిలదీస్తున్నారు. డిసెంబర్ 5న, ఉబర్ క్యాబ్ డ్రైవర్ దురాఘతం జరిగేది కాదు. రేపిస్టులకు భయం లేకుండా పోయిందనడానికి ఈ ఘటన నిదర్శనం, డిసెంబర్ 16, ఘటనలో నేరస్తులను అప్పుడే ఉరితీస్తే, ఈ దురాఘాతాలు చోటు చేసుకొనేవి కావు. కానీ న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే నేరస్తుల కొమ్ముకాస్తున్నారు. శిక్ష పడకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి 16న ఘన నివాళి న్యూఢిల్లీ: న గరంలో డి సెంబర్ 16, 2012, గ్యాంగ్ రేప్ బాధితురాలకి నివాళులు అర్పించేందుకు ఈ నెల 16వ తేదీన ద్వారకా నుంచి మధ్య ఢిల్లీ వరకూ బస్సు ర్యాలీ నిర్వహించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. జస్టిస్ సీకర్స్ నాయకత్వంలో సామాజిక పరిశోధన కేంద్రం, ఏన్హెచ్డీ, కొన్ని మితవాద సంఘాల కార్యకర్తలు కలిసి ఈ ర్యాలీని సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తాయి. నగరంలో మహిళకు భద్రత కల్పించాలనేది ఈ బస్సు ర్యాలీ ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు శనవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రెండేళ్ల క్రితం బస్సులోనే దుండగులు యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అదే రోజు మహిళల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీకి పిటిషన్ అందజేయనున్నట్లు ఎన్జీవోస్ పేర్కొంది. ‘ డిసెంబర్ 16, 2012లో నగరంలో నడుస్తున్న బస్సులోనే యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైందని గుర్తు చేసింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని విమానంలో సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. ఆమె మృతికి సంతాపం ఈ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు. -
'నిర్భయ'ను తలపించిన ఫ్యాషన్ షూట్!
ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తోంది. ఏది ఫ్యాషనో, ఏది కాదో గుర్తించలేక చేస్తున్న పనులు చివరకు అసభ్యంగా మారుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఇలాగే చేశాడు. అచ్చం నిర్భయ ఘటనను గుర్తుకుతెచ్చేలా ఓ లేడీ మోడల్‌ను, ఇద్దరు పురుషులను పెట్టి ఓ బస్సులో అతడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. 'ద రాంగ్ టర్న్' పేరుతో రాజ్ షెట్టి తీసిన ఫొటోలలో ఓ మహిళ బస్సులో ఇద్దరు పురుషులతో పోరాడుతున్నట్లు ఉంటుంది. వాళ్లలో ఒకరు ఆమె కాళ్లమీదుగా పడిపోతున్నట్లు కనిపిస్తుండగా రెండో వ్యక్తి మరింత అసభ్యంగా వ్యవహరిస్తుంటాడు. ఈ ఫొటోల లింక్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా ప్రచారం అయ్యింది. వాటిపై తీవ్రమైన ప్రతిస్సందనలు రావడంతో ఆ పేజీలను డిలిట్ చేసేశారు. ఒకవేళ ఎవరైనా వాటిని క్లిక్ చేసినా, ఎర్రర్ పేజి మాత్రమే చూపిస్తుంది. అయితే, నిర్భయ ఘటన ఆధారంగానే తన ఫొటో షూట్ సాగిందన్న మాట సరికాదని షెట్టి చెబుతున్నాడు. సమాజంలో ఒక భాగంగా, ఫొటోగ్రాఫర్‌గా ఉన్న తనకు అనేక ఆలోచనలు వస్తుంటాయని, బయటకు వెళ్లినప్పుడు ఎవరికైనా ఇలా జరగచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని అంటున్నాడు. అయితే, కొంచెం కూడా సెన్స్ అన్నది లేకుండా ప్రవర్తించాడంటూ ఈ ఫొటోగ్రాఫర్‌పై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది అయితే ఉచ్ఛనీచాలు తెలియని పంది అని కూడా తిట్టారు. -
దేశవ్యాప్తంగా 660 నిర్భయ కేంద్రాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు నిర్భయకు నివాళిగా దేశవ్యాప్తంగా 660 రేప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నిర్భయ సెంటర్స్‌గా పిలవనున్న ఈ కేంద్రాలు.. జిల్లాకొకటి చొప్పున మొత్తం 640 ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఎంపిక చేసిన మరో 20 చోట్ల కూడా అందుబాటులోకి రానున్నాయి. లైంగిక దాడులు, వే ధింపులు, అత్యాచారం, గృహ హింస బాధితులకు నిర్భయ కేంద్రాల్లో అన్ని రకాల సహాయం అందిస్తారు. వైద్యం, పోలీసులకు ఫిర్యాదు, మానసిక-సామాజిక మద్దతు, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, దుస్తులు వంటివి కల్పించి బాధితులకు అండగా నిలుస్తాయి. నిరంతరం పనిచేసే ఈ కేంద్రాల ఏర్పాటుకు దాదాపు రూ. 477 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర మహిళాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రణాళికకు అర్థిక వ్యయ కమిటీ(ఈఎఫ్‌సీ) అనుమతి ఇచ్చిందన్నారు. -
ఆరని ‘క్రాంతి’జ్వాలలు
సాక్షి, న్యూఢిల్లీ: అవే నినాదాలు.. ప్రదర్శనలు... ధర్నాలు.. ఆందోళనలు..‘న్యాయం చేయండి..న్యాయం చేయండి..’ ‘ఫాంసీదో..ఫాంసీదో..’ సరిగ్గా ఏడాది క్రితం జరిగిన నిర్భయ ఘటన అనంతరం జంతర్‌మంతర్‌లో కనిపించిన దృశ్యాలు. ఆనాటి ఘటనను కళ్లముందుకు తెస్తూ సోమవారం ఉదయం జంతర్‌మంతర్ పరిసరాలు ఓ ఏడాది వెనక్కివెళ్లాయి. గత ఏడాది డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై పైశాచిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఉరే సరి అంటూ వెల్లువెత్తిన నిరసన జ్వాలలు ఆరని మంటలా ఎగసిపడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, విద్యార్థులు ఇలా ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. కొందరు ర్యాలీలు నిర్వహించారు. మరికొందరు నిర్భయ ప్రతిమ ముందు కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. మరికొందరు చిత్రాలను వేసి నిరసన వ్యక్తం చేశారు. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను ఉరితీయడంతోపాటు, అత్యాచారాలను అరిట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘16 డిసెంబర్ క్రాంతి’ పేరిట ఏర్పాటైన సంస్థ ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. ఏడాది గడి చినా సడలని సంకల్పంతో వారంతా ముందుకెళుతున్నారు. డిసెంబర్ 16 ఘటనకు కారకులను ఉరితీసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సంస్థ సభ్యులు మరోసారి ప్రకటించారు. ఈ దారుణ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్బంగా వారు జంతర్‌మంతర్‌లో ఏర్పాటు చేసిన దామిని (నిర్భయ) ప్రతిమ వద్ద నివాళులర్పించారు. పాటలు పాడుతూ..నినాదాలు చేస్తూ ఆందోళనను కొనసాగించారు. ఏడాదిగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న 16 డిసెంబర్ క్రాంతి సభ్యులు తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. కొంతవరకు par మార్చగలిగాంఙ-జీవన్, 16 డిసెంబర్ క్రాంతి సభ్యుడు ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత నుంచి ‘16 డిసెంబర్ క్రాంతి’ సంస్థ ఆధ్వర్యంలో మేమంతా రోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. వీటితో ప్రభుత్వాల్లో కొంతమేర చలనం తీసుకురాగలిగాం. బస్సులు, కార్లకు నల్ల అద్దాలు తొలగించారు. రేప్ కేసులంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసేవారు కాదు. ఇప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ న మోదు చే స్తున్నారు. ‘మీ చెల్లా ?’ అని అడిగారు.. -రాహుల్మిశ్రా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్రాంతి సభ్యుడు డిసెంబర్ 16 ఘటన తర్వాత నుంచి మేం అంతా కలిసి ఉద్యమం మొదలు పెట్టాం. ఇక్కడికి వచ్చేవాళ్లు.. ‘గ్యాంగ్‌రేప్‌నకు గురైన నిర్భయ మీ చెల్లా ? ఫ్రెండా ? మరి ఎందుకు చేస్తున్నార’ని అడిగేవాళ్లు. రేపు ఈ ఘటన నా చెల్లికో.. తల్లికో జరగొద్దనే నేను ఏడాదిగా పోరాడుతున్నా అని చెప్పేవాణ్ణి. మొత్తంగా మా ఉద్యమం కొంతమేరైనా ఢిల్లీలో మార్పు తెచ్చిందని అనుకుంటున్నాం. వాళ్లను ఉరి తీసే వరకు వదలం -పల్లవి, ఎంఏ, క్రాంతి సభ్యురాలు మేం ఏడాదిగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మొదట్లో వందల్లో ఉండేవాళ్లం. తర్వాత సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజులు పదుల సంఖ్యలోనే ఇక్కడికి వచ్చినా పోరాటాన్ని మాత్రం వదల్లేదు. ఆమె పైశాచిక దాడికి పాల్పడ్డ నిందితులందరినీ ఉరి తీసే వరకు పోరాడతాం. చిన్నవాళ్లయితే నేరం చెయ్యొచ్చా ? -రజియా, క్రాంతి సభ్యురాలు ఈ ఘటన తర్వాత మా రక్తం ఉడికిపోయింది. చిన్నవాడు పెద్దవాడు అని శిక్షలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసినవాడు ఎవడైనా ఉరి తీయాల్సిందే. బాలనేరస్తుడికి మూడేళ్ల శిక్షతో సరిపెడతామంటున్నారు. అలాంటివాడు బయటికి వస్తే మళ్లీ అదే చేస్తాడు. వాడిని చూసి మరికొందరు తయారవుతారు. ఏడాది దాటినా ఢిల్లీలో పరిస్థితి అలాగే ఉంది. రాత్రయితే అమ్మాయిలు బయటికి వెళ్లాలంటే భయమే. -
నిర్భయకు డీపీసీసీ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 16 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ‘నిర్భయ’కు ఢిల్లీ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిర్భయ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా సోమవారం ఉదయం ‘ఫెర్ఫామ్ టు రిఫామ్’ పేరిట ఓ సెమినార్‌ను నిర్వహించారు.డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సెమినార్లో ఢిల్లీ ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు డా.ఓనికా మల్హోత్రాతోపాటు దాదాపు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. మహిళల సురక్ష, న్యాయపరమైన అంశాలపై గైనకాలజిస్టు డాక్టర్ ఉషా గార్గ్, విద్యావేత్త మనిదీప్‌కౌర్, అడ్వొకేట్ సునీతా చౌహాన్ ప్రసంగించారు. ఢిల్లీవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మహిళా బృందాల ద్వారా అవసరమైన సహాయం పొందవచ్చని డా.ఓనికా మల్హోత్రా పేర్కొన్నారు. మహిళల రక్షణకు మరికొన్ని చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. -
ఇంకా కళ్ల ముందే...
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగి సుమారు ఏడాది కావస్తున్నా ఆ క్రూర ఘటన నుంచి మృతురాలి తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను అతిక్రూరంగా పొట్టనపెట్టుకున్న నిందితులందరినీ ఉరి తీసినప్పుడే తమకు కాస్త మనశ్శాంతి కలుగుతుందని వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘సమయం గడిచిపోతోంది. ఆమె గాయాలు, ఆక్రందనలు ఇంకా తమ మదిలో తాజాగానే ఉన్నాయి. దాని నుంచి ఇప్పటివరకు బయటపడలేకపోతున్నామ’ని మృతురాలైన పారా మెడికల్ విద్యార్థిని తండ్రి బద్రీ సింగ్ పశ్చిమ ఢిల్లీ ద్వారకాలోని తన నివాసంలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఈ భవనంలోకి నాలుగు నెలల క్రితమే నిర్భయ కుటుంబం మారింది. చదువులోనే కాక క్రీడల్లోనూ ముందుండే తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందనుకునేలోపే ఈ ఘటన జరగడం ఎంతో కలచివేసిందని నిర్భయ తండ్రి అన్నారు. తన కూతురు బతుకు ఇంత దారుణంగా ముగుస్తుందని ఏనాడూ ఊహించలేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఇంటి తలుపు పక్కనే ఉండి నాన్నా అని ఆప్యాయంగా పిలిచేదని, ఆ రోజులను తలచుకుంటే ఎంతో బాధగా ఉందని తెలిపారు. డెహ్రాడూన్‌లో ఫిజియోథెరపీ చదివిన నిర్భయ ఢిల్లీ ఆస్పత్రిలో ట్రైనీగా పనిచేసిందన్నారు. ‘ప్రతిసారి ఆమె జ్ఞాపకాలే కళ్ల ముందు కదలాడుతున్నాయి. మా వరకు ఇప్పటికీ బతికి ఉన్నట్టే అనిపిస్తోంది. సమయం చూసుకోవడం లేదు. ప్రతిసారి తలుపు వెనకాలే ఉండి అకస్మాత్తుగా కనిపించకపోదా అని అనుకుంటున్నాన’ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోర్టర్‌గా పనిచేసే 54 ఏళ్ల బద్రీ సింగ్ తెలిపారు. నిందితులందరినీ ఉరి తీసిన రోజే తమకు సంతృప్తి కలుగుతుందన్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 16న కదులుతున్న ఓ ప్రైవేట్ బస్సులో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఓ జువెనైల్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అడ్డు వచ్చిన ఆమె స్నేహితుడిని కూడా తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వీరిద్దరిని రోడ్డుపైకి తోసేశారు. రోడ్డుపై గంటపాటు నిస్త్రాణంగా ఉన్న ఆమెను చూసి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 13 రోజుల పాటు ఢిల్లీలో బతుకుతో పోరాడిన ఆమె సింగపూర్‌కు తరలించగా అక్కడ మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన పెల్లుబికింది. అనేక మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. అత్యాచారం చేసిన నలుగురు నిందితులకు ఉరిశిక్షే సరైందని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 13న ఇచ్చిన తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు. ఐదో వ్యక్తి అంతకుముందే జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన మైనర్‌ను బాలనేరస్తుల గృహంలో మూడేళ్ల పాటు ఉంచాలని జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయంపై నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరతామని తెలిపారు. నిర్భయ తల్లి మాట్లాడుతూ కొన్ని గంటల్లో తిరిగి వస్తానని చెప్పిన నిర్భయ ఆ తర్వాత తిరిగి ఇంటికే రాలేదన్నారు. ఈ నెల 16న నిర్భయ స్మారక కార్యక్రమం నిర్వహించాలని యోచిస్తున్నామని తెలిపారు. -
నిర్భయ కేసులో దోషులు నలుగురికీ ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధించారు. వీరు నలుగురిని మంగళవారమే దోషులుగా నిర్ధారించినా, శిక్షను మాత్రం శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. అయితే, తీర్పుపై హైకోర్టులో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది తెలిపారు. దేశ రాజదాని ఢిల్లీలో గత డిసెంబర్ 16 నాటి రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్లు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆగస్టు 31న జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది. హత్య కేసులలో అత్యంత అరుదైన కేసుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. చిన్నారులు, నిస్సహాయులైన మహిళలు, బలహీనులైన వ్యక్తులు లేదా వృద్ధులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దోషులకు కోర్టు సాధారణంగా మరణశిక్ష విధిస్తుందని, ఇలాంటివే అత్యంత అరుదైన కేసుల కోవలోకి వస్తాయని పేర్కొం టున్నారు. 1955 వరకు హత్య కేసులన్నిటిలో దోషులకు మరణశిక్షే విధించేవారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో సజీవంగా పట్టుబడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్‌ను, పార్లమెంటు మీద దాడి కేసులో కుట్రదారు అఫ్జల్‌గురును అత్యంత రహస్యంగా ఉరి తీసిన విషయం తెలిసిందే. వీరికి రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించిన తర్వాత ఎవరికీ తెలియకుండా శిక్ష అమలుచేశారు. -
నిర్భయ కేసులో తీర్పు శుక్రవారానికి వాయిదా
-
నిర్భయ కేసులో తీర్పు శుక్రవారానికి వాయిదా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదాపడింది. దీనిపై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించారు. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నలుగురు నిందితులు నేరానికి పాల్పడ్డారని నిర్దారించింది. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్షాధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు వంటి 13 అభియోగాల్లో ఈ నలుగురిని దోషులుగా నిర్థారించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లకు సంబంధించి ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా శుక్రవారం నాడు శిక్షలు ఖరారు చేయనున్నారు. దీని కంటే ముందు నిందితుల తుది వాదనలను జడ్జి యోగేశ్‌ఖన్నా ప్రస్తుతం వింటున్నారు. ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే.. నిందితుల్లో ఒకరైన ముఖేష్.. హోంమంత్రి షిండేపై కోర్టు ధిక్కారణ కేసు పెట్టాలని జడ్జిని విజ్ఞప్తి చేశారు. తమపై కోర్టు శిక్షలు ఖరారు చేయకముందే.. హోంమంత్రి షిండే ఉరిశిక్ష వేస్తారంటూ ప్రకటనలు చేశారని ఓ లేఖలో జడ్జికి తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే నిందితుడు ముఖేష్ తన లేఖను వెనక్కు తీసుకున్నారు. అయితే, నేరం జరిగిన సమయానికి నిందితుడు ముఖేష్ వయస్సు 19 ఏళ్ల లోపేనని, అందువల్ల చట్టాలను పునస్సమీక్షించాలని దోషుల తరఫున వాదించిన డిఫెన్స్ లాయర్ కోరారు. మీడియా సమాజాన్ని ప్రభావితం చేసిందని, దోషుల పట్ల కోర్టు జాలిచూపి, మరణదండన నుంచి మినహాయింపు ఇవ్వాలని అడిగారు. ఉరిశిక్ష విధించడం ప్రాథమిక హక్కులకు భంగమని వాదిస్తూ.. పుట్టుకతోనే ఎవరూ నేరస్థులు కారన్న సుప్రీం వ్యాఖ్యలను డిఫెన్స్ న్యాయవాది ప్రస్తావించారు. అదే సమయంలో.. తాము నిర్దోషులమంటూ దోషులు నలుగురూ కోర్టు హాల్లో నినాదాలు చేశారు. కానీ అమాయకురాలైన అమ్మాయిని వాళ్లు క్రూరంగా హతమార్చారని, అలాంటివారి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని, మొత్తం దోషులందరికీ ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయవాది కోరారు. -
నిర్భయ కేసు: ఎప్పుడేం జరిగింది?
'నిర్భయ' కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. అత్యాచారం జరిగినప్పటినుంచి సంఘటన కాలక్రమం ఇలా ఉంది.. 16 డిసెంబర్, 2012: కదులుతున్న బస్సులో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై ఢిల్లీలో అత్యాచారం. 17 డిసెంబర్: బస్సు డ్రైవర్ రామ్ సింగ్, మరో ఇద్దరు నిందితుల అరెస్టు 18 డిసెంబర్: సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, సెంట్రల్ ఢిల్లీలో పోలీసులతో జనం ఘర్షణ, నాలుగో నిందితుని అరెస్టు 19 డిసెంబర్: ఢిల్లీ కోర్టులో ఇద్దరు నిందితుల హాజరు. తనను ఉరితీయాలంటూ వినయ్ అనే నిందితుని వేడుకోలు. 21 డిసెంబర్: కేసులో నిందితుడైన మైనర్ బాలుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు. బీహార్‌లో ఆరో నిందితుని పట్టివేత. 22 డిసెంబర్: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు. 23 డిసెంబర్: ఫాస్ట్ ట్రాక్ కోర్టును నెలకొల్పిన ఢిల్లీ హైకోర్టు. 24 డిసెంబర్: అత్యాచార కేసుల్లో నిందితులను వేగంగా విచారించి, శిక్షను పెంచేందుకు సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన 27 డిసెంబర్: చికిత్స కోసం సింగపూర్‌కు బాధితురాలి తరలింపు 29 డిసెంబర్: తీవ్ర గాయాలతో సింగపూర్ ఆస్పత్రిలో బాధితురాలి మరణం. 30 డిసెంబర్: ఢిల్లీకి బాధితురాలి మృతదేహం తరలింపు, అంత్యక్రియలు 2013 జనవరి ౩: ఐదుగురు నిందితులపై అత్యాచారం, హత్య, కిడ్నాప్, సాక్ష్యాల విధ్వంసం, హత్యాయత్నం కేసుల నమోదు 28 జనవరి: ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనరని తేల్చిన జువెనైల్ జస్టిస్ బోర్డు 2 ఫిబ్రవరి: ఐదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య, ఇతర నేరారోపణల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు మార్గం సుగమం 3 ఫిబ్రవరి: క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్సు విడుదల. మార్చి 19న లోక్‌సభలో, 21న రాజ్యసభలో బిల్లు ఆమోదం. 5 ఫిబ్రవరి: కోర్టులో విచారణ ప్రారంభం, నిందితుల వాంగ్మూలం రికార్డు. 11 మార్చి: తీహార్ జైల్లోని తన సెల్లో ఉరికి వేలాడుతూ కనిపించిన రామ్ సింగ్ 17 మార్చి: సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి, తన కుమార్తెకు న్యాయం చేయాలని వినతి. 14 జూన్: కస్టడీలో 18 ఏళ్లు నిండిన బాలనేరస్థుడు. 11 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు 25 జూలై: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పును ఆగస్టు 5కు వాయిదా వేసిన జువెనైల్ జస్టిస్ బోర్డు 22 ఆగస్టు: తీర్పు వెల్లడించేందుకు జువెనైల్ బోర్డుకు సుప్రీం ఆమోదం 31 ఆగస్టు: బాల నేరస్థుడు మూడేళ్ల పాటు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆదేశించిన జువెనైల్ జస్టిస్ బోర్డు 3 సెప్టెంబర్: తీర్పు వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు 10 సెప్టెంబర్: నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ అన్ని నేరాల్లోనూ దోషులుగా నిర్ధారణ. బుధవారం తీర్పు వెల్లడించనున్న కోర్టు. -
నిర్భయ కేసులో నిందితుల్ని దోషులుగా నిర్థారించిన కోర్టు
-
నిర్భయకేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ, రేపు తుది తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లను దోషులుగా నిర్ధారించారు. వీరికి శిక్షను మాత్రం రేపు ఖరారుచేయనున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం నాడు తెలిపారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. గత సంవత్సరం డిసెంబర్లో దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్ల జైలుశిక్ష ఇప్పటికే ఖరారైంది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది. అంతకుముందు మంగళవారం ఉదయమే తీహార్ జైలు నుంచి నలుగురు నిందితులను న్యూఢిల్లీలో గల సాకేత్ ప్రాంతంలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో తీర్పు వెల్లడించగానే సందడి నెలకొంది. గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులను సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. -
నిర్భయ కేసులో నేడు తుది తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన 'నిర్భయ' కేసుకు సంబంధించిన తీర్పు మంగళవారం ఢిల్లీ కోర్టు వెల్లడించనుంది. 2012 లో డిసెంబర్ 16 తేదిన జరిగిన గ్యాంగ్ రేప్ పార్లమెంట్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలల క్రితం 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ కదులుతున్న బస్ లో గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన దేశ ప్రజలను కలిచివేసింది. దక్షిణ ఢిల్లిలో మునిర్కా ప్రాంతోలో తన స్నేహితుడితో కలిసి బస్ లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిర్భయ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచింది. దాంతో దేశ ప్రజలందరూ విషాదం మునిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు మరణ శిక్ష విధించాలని దేశంలోని అత్యధిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. నిర్భయ కేసులో 2013 జనవరి 3 తేదిన చార్జిషీట్ దాఖలు కాగా, విచారణ ఫిబ్రవరి 5 తేదిన ప్రారంభించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను, డిఫెన్స్ 17 మందిని విచారించారు. ఈ కేసులో మరో ముద్దాయి రాంసింగ్ తీహార్ జైల్లో ఉరి వేసుకుని మరణించడంతో కేసు నుంచి తప్పించారు. అయితే మిగిలిన ముద్దాయిలు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ల భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం తేల్చనున్నారు. ఈ కేసులో నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, హత్యాప్రయత్నం, సాక్షాలను మాయం చేయడం, దోపిడితోపాటు ఇతర నేరాలను నలుగురు నిందితులపై మోపారు. ఈ కేసులో సాక్ష్యాలు రుజువైతే వీరికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో మైనర్ గా ఉన్న నిందితుడిని ఆగస్గు 31 తేదిన జువెనైల్ జస్టిస్ బోర్డు కు పంపారు. అయితే మైనర్ బాలుడికి విధించిన శిక్షపై బాధిత కుటుంబం ఆందోళన, నిరసనను వ్యక్తం చేశారు. మైనర్ నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని నిర్భయ కుటుంబం డిమాండ్ చేసింది.