దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లకు ఉరిశిక్ష విధించారు. వీరు నలుగురిని మంగళవారమే దోషులుగా నిర్ధారించినా, శిక్షను మాత్రం శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. అయితే, తీర్పుపై హైకోర్టులో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది తెలిపారు.
దేశ రాజదాని ఢిల్లీలో గత డిసెంబర్ 16 నాటి రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్‌లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్లు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆగస్టు 31న జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది.
హత్య కేసులలో అత్యంత అరుదైన కేసుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. చిన్నారులు, నిస్సహాయులైన మహిళలు, బలహీనులైన వ్యక్తులు లేదా వృద్ధులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దోషులకు కోర్టు సాధారణంగా మరణశిక్ష విధిస్తుందని, ఇలాంటివే అత్యంత అరుదైన కేసుల కోవలోకి వస్తాయని పేర్కొం టున్నారు. 1955 వరకు హత్య కేసులన్నిటిలో దోషులకు మరణశిక్షే విధించేవారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో సజీవంగా పట్టుబడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్ను, పార్లమెంటు మీద దాడి కేసులో కుట్రదారు అఫ్జల్గురును అత్యంత రహస్యంగా ఉరి తీసిన విషయం తెలిసిందే. వీరికి రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించిన తర్వాత ఎవరికీ తెలియకుండా శిక్ష అమలుచేశారు.
నిర్భయ కేసులో దోషులు నలుగురికీ ఉరిశిక్ష
Published Fri, Sep 13 2013 2:30 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement