
నిర్భయ కేసులో తీర్పు శుక్రవారానికి వాయిదా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు శిక్షల ఖరారు శుక్రవారానికి వాయిదాపడింది. దీనిపై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించారు. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నలుగురు నిందితులు నేరానికి పాల్పడ్డారని నిర్దారించింది. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్షాధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు వంటి 13 అభియోగాల్లో ఈ నలుగురిని దోషులుగా నిర్థారించిన విషయం తెలిసిందే.
ప్రధాన నిందితులైన ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లకు సంబంధించి ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా శుక్రవారం నాడు శిక్షలు ఖరారు చేయనున్నారు. దీని కంటే ముందు నిందితుల తుది వాదనలను జడ్జి యోగేశ్‌ఖన్నా ప్రస్తుతం వింటున్నారు. ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే.. నిందితుల్లో ఒకరైన ముఖేష్.. హోంమంత్రి షిండేపై కోర్టు ధిక్కారణ కేసు పెట్టాలని జడ్జిని విజ్ఞప్తి చేశారు. తమపై కోర్టు శిక్షలు ఖరారు చేయకముందే.. హోంమంత్రి షిండే ఉరిశిక్ష వేస్తారంటూ ప్రకటనలు చేశారని ఓ లేఖలో జడ్జికి తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే నిందితుడు ముఖేష్ తన లేఖను వెనక్కు తీసుకున్నారు.
అయితే, నేరం జరిగిన సమయానికి నిందితుడు ముఖేష్ వయస్సు 19 ఏళ్ల లోపేనని, అందువల్ల చట్టాలను పునస్సమీక్షించాలని దోషుల తరఫున వాదించిన డిఫెన్స్ లాయర్ కోరారు. మీడియా సమాజాన్ని ప్రభావితం చేసిందని, దోషుల పట్ల కోర్టు జాలిచూపి, మరణదండన నుంచి మినహాయింపు ఇవ్వాలని అడిగారు. ఉరిశిక్ష విధించడం ప్రాథమిక హక్కులకు భంగమని వాదిస్తూ.. పుట్టుకతోనే ఎవరూ నేరస్థులు కారన్న సుప్రీం వ్యాఖ్యలను డిఫెన్స్ న్యాయవాది ప్రస్తావించారు. అదే సమయంలో.. తాము నిర్దోషులమంటూ దోషులు నలుగురూ కోర్టు హాల్లో నినాదాలు చేశారు. కానీ అమాయకురాలైన అమ్మాయిని వాళ్లు క్రూరంగా హతమార్చారని, అలాంటివారి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని, మొత్తం దోషులందరికీ ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయవాది కోరారు.