ఆరని ‘క్రాంతి’జ్వాలలు
Published Mon, Dec 16 2013 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
సాక్షి, న్యూఢిల్లీ: అవే నినాదాలు.. ప్రదర్శనలు... ధర్నాలు.. ఆందోళనలు..‘న్యాయం చేయండి..న్యాయం చేయండి..’ ‘ఫాంసీదో..ఫాంసీదో..’ సరిగ్గా ఏడాది క్రితం జరిగిన నిర్భయ ఘటన అనంతరం జంతర్‌మంతర్‌లో కనిపించిన దృశ్యాలు. ఆనాటి ఘటనను కళ్లముందుకు తెస్తూ సోమవారం ఉదయం జంతర్‌మంతర్ పరిసరాలు ఓ ఏడాది వెనక్కివెళ్లాయి. గత ఏడాది డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై పైశాచిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఉరే సరి అంటూ వెల్లువెత్తిన నిరసన జ్వాలలు ఆరని మంటలా ఎగసిపడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, విద్యార్థులు ఇలా ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. కొందరు ర్యాలీలు నిర్వహించారు. మరికొందరు నిర్భయ ప్రతిమ ముందు కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. మరికొందరు చిత్రాలను వేసి నిరసన వ్యక్తం చేశారు.
నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను ఉరితీయడంతోపాటు, అత్యాచారాలను అరిట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘16 డిసెంబర్ క్రాంతి’ పేరిట ఏర్పాటైన సంస్థ ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. ఏడాది గడి చినా సడలని సంకల్పంతో వారంతా ముందుకెళుతున్నారు. డిసెంబర్ 16 ఘటనకు కారకులను ఉరితీసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సంస్థ సభ్యులు మరోసారి ప్రకటించారు. ఈ దారుణ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్బంగా వారు జంతర్‌మంతర్‌లో ఏర్పాటు చేసిన దామిని (నిర్భయ) ప్రతిమ వద్ద నివాళులర్పించారు. పాటలు పాడుతూ..నినాదాలు చేస్తూ ఆందోళనను కొనసాగించారు. ఏడాదిగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న 16 డిసెంబర్ క్రాంతి సభ్యులు తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
కొంతవరకు par మార్చగలిగాంఙ-జీవన్, 16 డిసెంబర్ క్రాంతి సభ్యుడు
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత నుంచి ‘16 డిసెంబర్ క్రాంతి’ సంస్థ ఆధ్వర్యంలో మేమంతా రోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. వీటితో ప్రభుత్వాల్లో కొంతమేర చలనం తీసుకురాగలిగాం. బస్సులు, కార్లకు నల్ల అద్దాలు తొలగించారు. రేప్ కేసులంటే ఎఫ్‌ఐఆర్ బుక్ చేసేవారు కాదు. ఇప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్ న మోదు చే స్తున్నారు.
‘మీ చెల్లా ?’ అని అడిగారు..
-రాహుల్‌మిశ్రా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, క్రాంతి సభ్యుడు
డిసెంబర్ 16 ఘటన తర్వాత నుంచి మేం అంతా కలిసి ఉద్యమం మొదలు పెట్టాం. ఇక్కడికి వచ్చేవాళ్లు.. ‘గ్యాంగ్‌రేప్‌నకు గురైన నిర్భయ మీ చెల్లా ? ఫ్రెండా ? మరి ఎందుకు చేస్తున్నార’ని అడిగేవాళ్లు. రేపు ఈ ఘటన నా చెల్లికో.. తల్లికో జరగొద్దనే నేను ఏడాదిగా పోరాడుతున్నా అని చెప్పేవాణ్ణి. మొత్తంగా మా ఉద్యమం కొంతమేరైనా ఢిల్లీలో మార్పు తెచ్చిందని అనుకుంటున్నాం.
వాళ్లను ఉరి తీసే వరకు వదలం
-పల్లవి, ఎంఏ, క్రాంతి సభ్యురాలు
మేం ఏడాదిగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మొదట్లో వందల్లో ఉండేవాళ్లం. తర్వాత సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజులు పదుల సంఖ్యలోనే ఇక్కడికి వచ్చినా పోరాటాన్ని మాత్రం వదల్లేదు. ఆమె పైశాచిక దాడికి పాల్పడ్డ నిందితులందరినీ ఉరి తీసే వరకు పోరాడతాం.
చిన్నవాళ్లయితే నేరం చెయ్యొచ్చా ?
-రజియా, క్రాంతి సభ్యురాలు
ఈ ఘటన తర్వాత మా రక్తం ఉడికిపోయింది. చిన్నవాడు పెద్దవాడు అని శిక్షలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసినవాడు ఎవడైనా ఉరి తీయాల్సిందే. బాలనేరస్తుడికి మూడేళ్ల శిక్షతో సరిపెడతామంటున్నారు. అలాంటివాడు బయటికి వస్తే మళ్లీ అదే చేస్తాడు. వాడిని చూసి మరికొందరు తయారవుతారు. ఏడాది దాటినా ఢిల్లీలో పరిస్థితి అలాగే ఉంది. రాత్రయితే అమ్మాయిలు బయటికి వెళ్లాలంటే భయమే.
Advertisement
Advertisement