సాక్షి, న్యూఢిల్లీ : అనేక ప్రజా పోరాటాలకు, ప్రదర్శనలకు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్ మైదానం మూగబోతోంది. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కూత వేటు దూరంలో ఉండి ప్రజా గళాన్ని ప్రతిధ్వనించిన జంతర్ మంతర్ మసకబారుతోంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, వ్యక్తులకు పోరాట స్ఫూర్తినిచ్చిన ఈ వేదిక తన పోరాట పంథాను మార్చుకోబోతోంది. ఈ వేదికను మూసివేయాలని, ప్రజా నిరసనలకు ఇక్కడ ఇక ఏ మాత్రం అనుమతులు ఇవ్వరాదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడమే అందుకు కారణం. వారం రోజుల్లోగా ఈ వేదికను ఖాళీ చేయించాల్సిందిగా నగర పోలీసులకు కూడా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఆందోళనలకు రామ్‌లీలా మైదాన్‌ను అనుమతించండని కూడా పేర్కొంది.
ఢిల్లీ నగరంలో ప్రజా పోరాటాలు లేదా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రధానంగా మూడు వేదికలు ఉన్నాయి. వాటిలో పార్లమెంట్, పాలక భవనాలున్న రైసినా హిల్స్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో జంతర్ మంతర్ మైదానం ఉంది. ఎక్కువ మంది కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ మార్గం గుండానే వెళతారు. ఐదువేల మందికి లోపల వచ్చే ప్రజాందోళనలకు ఇక్కడ అనుమతిస్తారు. ఐదు వేల మందికి మించితే రైసినా హిల్స్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌లీలా మైదాన్‌లో అనుమతిస్తారు. (సాక్షి)యాభైవేలకు పైగా జనం తరలి వచ్చేదుంటే నగరంలో బురారీ గ్రౌండ్‌ను అనుమతిస్తారు.
1988లో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ భారీ ర్యాలీ తర్వాత నుంచి జంతర్ మంతర్ శాంతియుత ప్రజా పోరాటాలకు వేదికగా గుర్తింపు పొందింది. నాడు భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వాన భారీ రైతులు ర్యాలీ జరిగింది. అప్పుడు లక్షలాదిగా తరలి వచ్చిన రైతులతో బోట్‌క్లబ్, ఇండియా గేట్ మైదానాలు, రాజ్‌పథ్ రోడ్లు కిక్కిర్సి పోయాయి. అంతటి మహార్యాలీకి స్పందించిన అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నింటిని నెరవేర్చింది. అప్పట్లో పార్లమెంట్ వీధిలోకి ప్రజా ప్రదర్శనలు(సాక్షి) అనుమతించే వారు. మంత్రులు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రజా ప్రదర్శనల వద్దకు వచ్చి వారి విజ్ఞప్తులు స్వీకరించే వారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలిచ్చే వారు. 2003లో తీసుకొచ్చిన పోలీసుల స్టాండింగ్ ఉత్తర్వులతో పరిస్థితి మారిపోయింది.
నిత్యం 144 సెక్షన్ అమలు
అప్పటి నుంచి పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం తదితర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నలుగురికి మించి గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. రెండు నెలలకు మించి ఈ ఉత్తర్వులను పొడిగించరాదు. రాజకీయ వ్యవస్థకు లోబడి చట్టం స్ఫూర్తిని పట్టించుకోని పోలీసు విభాగం ప్రతి రెండు నెలలకోసారి ఈ నిషేధ ఉత్తర్వులను పొడిగిస్తూనే వస్తోంది. గుడ్డిగా ఈ 144వ సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులను అమలు చేయడం తగదని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇతర చట్టాలను ఉపయోగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో(సాక్షి) మాత్రమే ఈ సెక్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని ఆచార్య జగదీశారానాంద అవధూత కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని ప్రజా సంఘాలు కూడా ఈ నిషేధ ఉత్తర్వులను సవాల్ చేయడం లేదు.
2003 నుంచే ముందస్తు అనుమతి
2003 సంవత్సరం నుంచి ప్రజాందోళనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్టాండింగ్ ఉత్తర్వులు తెలియజేస్తుండడంతో అప్పటి నుంచి ప్రజాందోళనలకు జంతర్ మంతర్ ప్ర«ధాన వేదికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పురుడు పోసుకుంది ఈ వేదికపైనే. ఈ వేదికలో రోజుకు ఎనిమిది నుంచి పది ఆందోళనలు జరుగుతుంటాయి. వాటిలో సమూహాలు ఉంటాయి. వ్యక్తుల ఒంటరి పోరాటాలు ఉంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే ఈ మైదానంలో 2,283 ప్రజాందోళనలు కొనసాగాయి. గతేడాది ఇంతకన్నా తక్కువ అంటే, 1,921 ఆందోళనలు కొనసాగాయి. అప్పటి నుంచి ఎవరూ కూడా పార్లమెంట్ వైపు దూసుకుపోయి ఆందోళన చేయాలనుకోవడం లేదు. అలాంటి ప్రయత్నాలు జరిగినా పోలసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. 2012, డిసెంబర్ 22వ తేదీన మాత్రం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వీధి, ఇండియా గేట్ వరకు ప్రజాందోళన పెల్లుబికింది. నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపేసినందుకు అంతటి ఆందోళన చెలరేగింది.
ముంబై నగరంలోకూడా...
ఢిల్లీ తరహాలోనే ప్రజాందోళనలకు ముంబై నగరంలో కూడా ఆజాద్ మైదాన్ ఉంది. రాష్ట్ర సచివాలయం (మంత్రాలయ)కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. 1992–93లో ముంబైలో పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం మధ్యన అల్లర్లు జరగడంతో ముంబై సెంట్రల్ బిజినెస్ జిల్లాలో కూడా నిరంతరంగా 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాందోళనలను క్రమబద్దీరించాలని, వాటికొక ఓ వేదిక కల్పించాలని ముంబై హైకోర్టు ఆదేశించడంతో ఆజాద్ మైదాన్ అందుకు వేదికయింది. అప్పటి నుంచి ఈ మైదాన్‌లో ఎన్నో ర్యాలీలు జరిగాయి. మరాఠీ క్రాంతి మోర్చా ఈ మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీకి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ప్రజలు హాజరయ్యారు.
ఆందోళన చేయడం హక్కేనా?
ఆందోళన చేయడం ప్రజల హక్కు కింద అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం గుర్తించడం లేదు. అయితే పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలోని 21వ అధికరణం ప్రజల శాంతియుత ఆందోళనను ఓ హక్కుగా అనుమతిస్తోంది. అయితే ఈ హక్కు వల్ల ఇతరుల స్వేచ్ఛ, భద్రత, ఆరోగ్యానికి భంగం కలగరాదు. ఈ అంతర్జాతీయ అధికరణం గురించి తెలుసో, తెలియదోగానీ జంతర్ మంతర్ చుట్టుపక్కల(సాక్షి) నివసిస్తున్న ప్రజలు తమకు ధ్వనికాలుష్యం వల్ల, మైదానం చుట్టూ ఆందోళనకారులు చెత్తా చెదారం పడేయం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులే అవడం వల్ల వారి మాటను దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment