మరో పోరు
దేశ రాజధాని నగరం ఢిల్లీ వేదికగా మరోపోరుకు తమిళ అన్నదాతలు శ్రీకారం చుట్టారు. గోచీతో పీఎంవో వైపుగా అన్నదాతలు పరుగులు తీయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వీరిని పోలీసులు అరెస్టు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.
సాక్షి, చెన్నై:
కరువుతో తల్లడిల్లు్లతున్న తమిళ రైతులకు అన్ని రకాల రుణాల మాఫీ, కావేరి అభివృద్ధిమండలి, పర్యవేక్షణకమిటీ, నదుల అనుసంధానం, తదితర డి మాండ్లతో మూడు నెలల క్రితం తమిళ రైతులు ఢిల్లీ వేదికగా ఆందోళనలు సాగించిన విషయం తెలిసిందే. 41 రోజుల పాటు రోజుకో రీతిలో వినూత్న నిరసనల్ని సాగించారు. జంతర్‌మంతర్ వేదికగా సాగిన ఈ నిరసనలు దేశంలోని రైతు సంఘాలకు కనువిప్పుగా, ఆదర్శంగా మారింది.
తమిళ రైతుల పోరు, దేశవ్యాప్త పోరుకు ఎక్కడ దారి తీస్తుందోనన్న ఆందోళనతో ఆ సమయంలో కంటితుడుపు చర్యగా హామీలు, బుజ్జగింపులకు స్వయంగా సీఎం పళనిస్వామి , కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ రంగంలోకి దిగి సఫలీకృతులయ్యారు. అయితే, తమకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించడంతో అన్నదాతలు జీర్ణించుకోలేక పోయాడు. మరోపోరు నినాదంతో మళ్లీ ఢిల్లీ వేదికగా ఆందోళనకు ఆదివారం శ్రీకారం చుట్టారు.
ఆందోళన
తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా శుక్రవారం ఢిల్లీకి రైలులో వంద మంది రైతులు కదిలారు. దక్షిణ భారత నదుల అనుసంధానం సంఘం నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఆదివారం ఉదయాన్నే ఢిల్లీలో అన్నదాతలు అడుగు పెట్టారు. దిగీ దిగగానే నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా పీఎంవో వైపు కదిలారు. మార్గమధ్యలోని ఓ ప్రాంతంలో తమ పంచె, చొక్కాలను విప్పేశారు. గోచీలను ధరించి, ఎముకలు నోట కరుచుకుని పరుగులు తీశారు. వంద మంది రైతులు తమ డిమాండ్లతో నినదిస్తూ పీఎంవో వైపుగా దూసుకొస్తున్న సమాచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మార్గమధ్యలో నిరసన కారుల్ని అడ్డుకున్నారు. దీంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళనకు అన్నదాతలు దిగారు. ఆందోళన కారుల్ని బుజ్జగించేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్రంగానే ప్రయత్నించారు. ఏమాత్రం రైతన్నలు తగ్గని దృష్ట్యా, ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులు, అన్నదాతల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఉదయాన్నే అల్పాహారం కూడా తీసుకోకుండా నిరసన బాట పట్టడంతో ఈరోడ్‌కు చెందిన జయరామన్, పొల్లాచ్చికి చెందిన బాలసుబ్రమణ్యం అనే రైతులు స్పృహ తప్పారు. అయితే, వీరికి ఎలాంటి చికిత్స అందించకుండా, పార్లమెంట్ రోడ్డు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి అయ్యాకన్ను తమిళ మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కుతగ్గేది లేదని తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి ఇస్తామని, ఇతర ప్రాంతాల్లోకి వస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఢిల్లీ వదలి వెళ్లి పోవాలని పోలీసులు అన్నదాతల్ని హెచ్చరిస్తున్నారు. అయినా పోలీసుస్టేషన్ ఆవరణలో బైఠాయించి అన్నదాతలు ఆందోళనకొనసాగిస్తున్నారు.