దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరసనలకూ, ధర్నాలకూ, ధిక్కారానికీ, తిరుగు బాటు స్వరాలకూ చిరునామాగా ఉంటున్న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ సోమవారం నుంచి మూగబోయింది. ఇకపై అక్కడ సభలూ, సమావేశాలూ ఉండవు. ప్రసంగాలు, నినాదాలు, పాటలు వినబడవు. అక్కడ గుమిగూడి గొంతెత్తే జనం వల్ల ఆ ప్రాంతం కాలుష్యమయమైందని... వారి కార్యకలాపాలు పర్యావరణ చట్టా లను ఉల్లంఘిస్తున్నాయని... అందుమూలంగా పౌరహక్కులు నాశనమవుతున్నా యని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)వారు ఈ నెల మొదట్లో అభిప్రాయ పడ్డారు. అయిదువారాల్లో దీన్నంతటినీ చక్కదిద్దాలని ఆదేశించారు.
పర్యవసానంగా ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులందరినీ వెళ్లగొట్టి అక్కడున్న శిబిరాలనూ, తాత్కాలిక నిర్మాణాలనూ తొలగించి ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నదని ఎన్‌జీటీకి నివేదిక సమర్పించారు. జంతర్‌మంతర్‌కు కూతవేటు దూరంలో అధికార ప్రతీక లైన పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ తదితరాలుంటాయి. కానీ దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో, ఎవరికెలాంటి సమస్యలున్నాయో తెలు సుకోదల్చుకున్నవారికి మాత్రం జంతర్‌మంతరే దర్శనీయ స్థలం. వారు పదిమంది కావొచ్చు... వేయిమంది కావొచ్చు ఆందోళనకారులు తమ తమ భాషల్లో గోడు వెళ్లబోసుకోవడం అక్కడ పరిపాటి.
అధికార పీఠానికి దగ్గర్లో గొంతెత్తితే, తమ సమస్యపై అందరి దృష్టీ పడుతుందని, పరిష్కారం సులభమవుతుందని సాధారణ జనం విశ్వసిస్తారు. అందువల్లే మారుమూల ఆదివాసీ గూడేల నుంచి వచ్చే చింకిపాతరాయుళ్లు మొదలుకొని... దేశం కోసం సర్వస్వం ఒడ్డి యుద్ధ రంగంలో పోరాడి రిటైరైన మాజీ సైనికుల వరకూ అందరికందరూ జంతర్‌మంతర్‌ను ఆశ్రయిస్తారు. దళితులు, వెనకబడిన కులాలవారు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కాంట్రాక్టు కార్మికులు– ఇలా అన్ని రకాలవారూ దాన్ని వెదుక్కుంటూ వస్తారు. జంతర్‌మంతర్ అందరూ అనుకునే సంప్రదాయ పద్ధతిలో నిరసనలు జరిగే చోటు కాదు. ఏకకాలంలో బహుళ నిరసనలకు అది చోటిచ్చేది. ఒకచోట పది పదిహేనుమందికి మించరు. మరోచోట వందమంది గుమిగూడ తారు. ఇంకొకచోట అయిదారు వందలమంది చేరి గొంతెత్తుతారు. గత అయి దేళ్లుగా ఒక యువకుడు ‘నేను బతికే ఉన్నానహో...’ అంటూ మెడలో ప్లకార్డు పెట్టు కుని ఒంటరిగా నిరసనకు దిగుతున్నాడు. ఒక దళిత యువతిని పెళ్లాడిన నేరానికి తన కుటుంబమంతా ఏకమై రికార్డుల్లో చనిపోయానని రాయించారని, పర్యవ సానంగా తాను జీవన్మృతుణ్ణి అయ్యానని అంటున్నాడు.
ప్రజాస్వామ్యం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మాత్రమే ఉండదు. అది నిర సన వ్యక్తం చేయడానికి, నిలదీయడానికి సామాన్యులకు గల హక్కులో ఉంటుంది. దేనిపైన అయినా నిర్భీతిగా వ్యక్తం చేసే అభిప్రాయంలో ఉంటుంది. అధికార పీఠాలపై ఉన్నవారిని మీరు చేస్తున్నది తప్పని చెప్పగల సాహసంలో ఉంటుంది. తెలివైన పాలకులు అసమ్మతికి చోటిస్తారు. తమ పాలన ఎలా ఉన్నదో తెలుసు కోవడానికి నిరసనలు ఉపకరిస్తాయి. కానీ రాను రాను వాటిపై పాలకులు మండి పడుతున్నారు. చిన్నపాటి అసమ్మతిపై కూడా అసహనం ప్రదర్శిస్తున్నారు. వాటి గొంతు నొక్కాలని చూస్తున్నారు. దురదృష్టమేమంటే ఇటీవలికాలంలో న్యాయ స్థానాలు సైతం ఆందోళన చేస్తున్నవారికి ఆసరాగా నిలబడటంలేదు. ఇప్పుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు విస్మయం కలిగిస్తాయి. ఎడతెగని నిరసనల కారణంగా అపరిశుభ్రత రాజ్యమేలుతున్నదని, వాతావరణ కాలుష్యం పెరిగిందని, తమకు రాత్రుళ్లు నిద్ర కరువవుతున్నదని, ఆ రహదారివైపు పోవా లంటే నరకంగా మారిందని జంతర్‌మంతర్ వాసులు కొందరు పిటిషన్ దాఖలు చేశారు. నిరసనల ‘కాలుష్యం’ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకుందుకు ఎన్‌జీటీ చేసిన ప్రయత్నమేమిటో తెలియదు. దాని ఆదేశాలు చూస్తే పిటిషనర్ల వాదనను యథాతథంగా ఆమోదించినట్టు కనబడుతుంది. ఆందోళన చేయడా నికొచ్చిన వారు కాలకృత్యాలు తీర్చుకోవడం, రోడ్డుపైనే స్నానాలు చేయడం, బట్టలు ఉతు క్కోవడం వంటి పనులతో అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నా రని ఎన్‌జీటీ బెంచ్ అభిప్రాయపడింది.
ఈ అంశాల్లో నగర పాలక సంస్థ చేయదగినవేమిటో, పోలీసు యంత్రాంగం విధించగల పరిమితులేమిటో ఆలోచించాల్సింది. ఎన్‌జీటీ ఏర్పడిననాడు అది ఇలాంటి ఆదేశాలివ్వగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఆ ట్రిబ్యునల్ వచ్చాకే వాయు కాలుష్యం, నదీ కాలుష్యం, ట్రాఫిక్ సమస్య వంటి అంశాలు ప్రముఖంగా చర్చకొస్తున్నాయి. అయితే ఎన్‌జీటీ వాటిని ఏమేరకు చక్కదిద్దగలిగిందో చెప్పడం మాత్రం కష్టం. తమకు నచ్చని ఆదేశాలను ప్రభుత్వాలు బాహాటంగానే పక్కనబెడుతున్నాయి. చెప్పాలంటే జంతర్‌మంతర్ విషయంలో అది ఇచ్చిన ఆదేశాలను మాత్రమే ఈమధ్యకాలంలో అధికార యంత్రాంగం తు చ తప్పకుండా పాటించింది.
స్వాతంత్రోద్యమకాలంలో ఢిల్లీలో ఆజద్ పార్క్, ఫిరోజ్ షా కోట్ల, జమా మసీదు, యమునా తీరం వంటì ఎన్నో నిరసన స్థలాలుండేవి.
స్వాతంత్య్రానంతరం పార్లమెంటు సమీపంలోని పటేల్ చౌక్, సంసద్ మార్గ్ ఆందోళనలకు నిలయంగా ఉండేవి. 1966లో గోవధ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారాక పార్లమెం టుకు దగ్గర్లో నిరసన తెలపడాన్ని నిషేధించారు. చివరకది జంతర్‌మంతర్‌లో స్థిరపడింది. ఒక్క జంతర్‌మంతర్ అనే కాదు...హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ప్రాంతంలో కూడా నిరసనలు వినబడకూడదని ఆమధ్య తెలంగాణ సర్కారు నిషే ధించింది. పదిమందికీ తమ గోడు వెళ్లబోసుకుంటే, ప్రభుత్వాలపై అన్నివైపుల నుంచీ ఒత్తిడి వస్తుందని, తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పౌరులు విశ్వ సిస్తారు. అయితే నిరసనలెప్పుడూ సొగసుగా ఉండవు. అవి ‘ఆదర్శవంతం’గా ఉండాలని కోరుకోవడం వృథా. ‘సరైన’ పాలన అందించినప్పుడు వాటంతటవే మాయమవుతాయి. ఈలోగా ఆ నిరసనలను తరిమేయాలనుకోవడం ధర్మం కాదు.
Comments
Please login to add a commentAdd a comment