న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు నిర్భయకు నివాళిగా దేశవ్యాప్తంగా 660 రేప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నిర్భయ సెంటర్స్‌గా పిలవనున్న ఈ కేంద్రాలు.. జిల్లాకొకటి చొప్పున మొత్తం 640 ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఎంపిక చేసిన మరో 20 చోట్ల కూడా అందుబాటులోకి రానున్నాయి. లైంగిక దాడులు, వే ధింపులు, అత్యాచారం, గృహ హింస బాధితులకు నిర్భయ కేంద్రాల్లో అన్ని రకాల సహాయం అందిస్తారు. వైద్యం, పోలీసులకు ఫిర్యాదు, మానసిక-సామాజిక మద్దతు, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, దుస్తులు వంటివి కల్పించి బాధితులకు అండగా నిలుస్తాయి. నిరంతరం పనిచేసే ఈ కేంద్రాల ఏర్పాటుకు దాదాపు రూ. 477 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర మహిళాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రణాళికకు అర్థిక వ్యయ కమిటీ(ఈఎఫ్‌సీ) అనుమతి ఇచ్చిందన్నారు.