గుంటూరు ఈస్ట్: నిరుపేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు 10 రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి హైదరాబాద్‌లో ఉండటం, నిందితులను కాపాడేందుకు ఓ పెద్ద మనిషి మభ్యపెట్టిన కారణంగా బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. గుంటూరు లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన 8వ తరగతి చదివే 13 సంవత్సరాల బాలిక జనవరి 28వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని చిల్లర కొట్టుకు వెళ్లింది. బాలికకు పరిచయస్తుడైన 23 ఏళ్ల వ్యక్తి ఆటోలో వచ్చి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళదామంటూ బాలికను ఆటో ఎక్కమన్నాడు.
బాలిక నిరాకరించడంతో చేయి పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించాడు. అతను తెలిసిన వ్యక్తి అవడంతో కొంతసేపు బాలిక ప్రతిఘటించలేదు. అయితే ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు ఎక్కారు. ఆటోను బాలికకు తెలియని ప్రాంతాల వైపునకు తీసుకెళ్తుండటంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటోను నగరంపాలెంలో పాడుబడ్డ స్థితిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లోకి తీసుకెళ్లి రెండోసారి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు బాలికను తీవ్రంగా కొట్టి ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో బాలికను ఆర్టీసీ బస్టాండు సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు.
నిందితులు బాలిక బంధువులకు ఫోన్ చేసి బస్టాండ్ సమీపంలో ఆమె ఒంటరిగా కనిపించినట్లు చెప్పారు. బాలిక తండ్రి ఊళ్లో లేని కారణంగా బంధువులు ఆమెను ఇంటికి చేర్చారు. 4 రోజుల అనంతరం తండ్రి ఇంటికి చేరుకుని బాలికను విచారించగా నిందితుల దుర్మార్గం బయటపడింది. అయితే స్థానిక పెద్ద ఒకరు బాలిక తల్లిదండ్రులను సంప్రదించి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుందని పోలీసులే ఇక్కడకు వచ్చి చర్యలు తీసుకునేలా తాను ప్రయత్నిస్తానని నమ్మించాడు. అయితే ఆ పెద్ద మనిషి నిందితుల తరఫునే వ్యవహరిస్తున్నాడని గుర్తించి బాలిక తండ్రి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. నిందితులు గతంలోనూ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసి పెద్దల పంచాయితీతో బయటపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
బాలికపై సామూహిక లైంగికదాడి
Published Sat, Feb 10 2018 7:08 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment