శిక్ష బాధితులకేనా? | Ten percent of rape cases are punishable | Sakshi
Sakshi News home page

శిక్ష బాధితులకేనా?

Published Thu, Jun 8 2017 2:47 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

శిక్ష బాధితులకేనా? - Sakshi

శిక్ష బాధితులకేనా?

అత్యాచార కేసుల్లో 10 శాతమైనా దాటని శిక్షలు
- రాష్ట్రంలో మూడేళ్లలో 3,449 కేసులు
- సగం కేసులు ‘రాజీ’తో మూసివేత
40 శాతం కేసులు దర్యాప్తు దశలోనే..
- దేశవ్యాప్తంగా లైంగిక దాడుల కేసుల్లో 29 శాతం శిక్షలు
 
సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో మహిళలకు వేధింపులు, ఆగడాల నియంత్రణ మేడిపండు చందంగానే కనిపిస్తోంది. నిర్భయ చట్టం వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, ప్రతిఘటనపై కేసులు నమోదు చేస్తున్నా.. కనీసం 10 శాతం మందికి కూడా శిక్షలు పడడం లేదు. దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం, ఆధారాల సేకరణ సరిగా జరగకపోవడం, ఏళ్లకేళ్లు సుదీర్ఘకాలం దర్యాప్తు, విచారణలు సాగడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఏళ్లకేళ్లుగా వేల సంఖ్యలో కేసులు దర్యాప్తు దశలోనో, కోర్టు విచారణ దశలోనో పెండింగ్‌లో ఉండిపోతుండడంతో.. బాధితులు కోర్టుల చుట్టూ తిరగలేక, ఒత్తిళ్లు భరించలేక రాజీకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది కూడా శిక్షల శాతం తగ్గిపోవడానికి కారణమవుతోంది. కేసుల్లో శిక్షల శాతం పెరగకపోవడంతో నేరాలకు పాల్పడ్డవారు దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు.
 
మూడేళ్లలో 3,449 కేసులు
విభజన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3,449 అత్యాచార కేసులు నమోదైనట్లు పోలీసు శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ కేసుల్లో నిందితులకు శిక్షపడినవి కేవలం 10 శాతం మాత్రమే. ఏటా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిల్లో 52 శాతం కేసుల్లో చార్జిషీట్‌ దాఖలవుతుండగా, మిగతా 48 శాతం పెండింగ్‌ దశలోనే ఉండిపోతున్నాయి.
 
సరైన ఆధారాల్లేక..
కేసుల దర్యాప్తులో సరైన ఆధారాలు లభించని క్రమంలో కోర్టులు కొట్టివేసిన కేసులూ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. 2014లో 272 కేసులు, 2015లో 117, 2016లో ఒక్క కేసును ఇలా కొట్టివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు సరైన ఆధారాలు సేకరించకపోవడం, బాధితులు, నిందితులు రాజీ ధోరణిలో కేసు కొట్టివేయించుకోవడం, ఫోరెన్సిక్‌ ఆధారాల్లో బలం లేకపోవడంతో కేసుల్లో నిందితులు సులువుగా తప్పించుకుంటున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
 
1,204 కేసులు దర్యాప్తు దశలోనే..
గత మూడేళ్లుగా నమోదైన అత్యాచార కేసుల్లో 1,204 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నట్టు క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు మారిపోవడం, బాధితులు, నిందితులవైపు నుంచి ఒత్తిడి రావడంతో ఆయా కేసుల్లో చార్జిషీట్లు వేయడం లేదని అధికారులు తెలిపారు. శిక్షలుపడే వరకు కోర్టుల చుట్టూ తిరగలేక రాజీపడుతున్న కేసుల్లో ఇవి కూడా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
దేశవ్యాప్తంగా 29 శాతం శిక్షలు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచార కేసుల్లోనూ శిక్షల శాతం తక్కువగానే ఉంటున్నాయి. 2015లో దేశవ్యాప్తంగా 34,651 అత్యాచార కేసులు నమోదుకాగా.. వాటిలో కేవలం 29 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఈ కేసుల్లో చార్జిషీటు దాఖలులో దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం, రాజీ పడుతున్న కేసులే అధికంగా ఉండడం తక్కువ శాతం శిక్షలకు కారణమని పేర్కొంది. అయితే అత్యాచార కేసుల్లో 33 శాతం కేసులు అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు వంటి కారణా లతోనే నమోదవుతున్నట్లు పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది.
 
అన్ని చర్యలూ చేపడుతున్నాం..
‘‘అత్యాచార కేసుల అంశం సున్నితమైంది. ఆ కేసుల్లో బాధితుల వైపు న్యాయం చేసేందుకు పోలీసు శాఖ అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా అత్యాచారాల కేసుల్లో శిక్షల శాతం 29 అయితే.. రాష్ట్రంలో 10 శాతంగా ఉంది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసులు, చార్జిషీట్‌ నమోదు వ్యవహారాల్లో రాష్ట్ర అధికారులు కీలకంగా కృషి చేస్తున్నారు. త్వరలోనే కోర్టు మానిటరింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మహిళల భద్రత, రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశమే లేదు. అత్యాచారాల కేసుల్లో 33 శాతం కేసులు ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో నమోదవుతున్నాయి. మిగతా కేసులన్నింటిలోనూ దర్యాప్తు యథావిధిగా జరుగుతుంది..’’
– డీజీపీ అనురాగ్‌శర్మ
 
కోర్టు మానిటరింగ్‌ వ్యవస్థ ఎక్కడ?
మహిళలపై హింస కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పదే పదే చెప్పిన ప్రభుత్వాలు.. ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సున్నితమైన, తీవ్రమైన నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు శాఖ నేతృత్వంలో కోర్టు మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని పోలీసు శాఖ మూడేళ్ల నుంచి చెబుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు.

దానివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతంపై ప్రభావం చూపిస్తోందని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మానిటరింగ్‌ వ్యవస్థ ఉంటే అత్యాచారాల కేసుల్లో దర్యాప్తు అధికారుల అటెండెన్స్, బాధితులు, నిందితుల హాజరు.. ఇలా అన్నీ పక్కాగా తేదీల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్రంలో పోలీసు శాఖ ఇంకా కోర్టు కానిస్టేబుళ్ల మీద ఆధారపడే కేసుల విచారణను పర్యవేక్షిస్తోంది. దానివల్ల దర్యాప్తు అధికారుల్లో నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం కేసుల నిర్వీర్యానికి ప్రధాన కారణమవుతోందనే అభిప్రాయముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement