ఐదేళ్ల బాలికపై లైంగికదాడి
Published Tue, Apr 1 2014 2:23 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై మానవ మృగం లైంగికదాడికి పాల్పడి ఆపై పరారయ్యాడు. జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితురాలి తల్లి దారుణాన్ని ఎవరికీ చెప్పకోలేక మిన్నకుండిపోయింది. వారం రోజుల తర్వాత ప్రజాచైతనయాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన ప్రజాహక్కుల జేఏసీ నాయకులను కలిసి చిన్నారికి జరిగిన దారుణాన్ని చెప్పుకుని విలవిలలాడింది. వారి సహకారంతో చిన్నారిని సోమవారం చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించటంతో విషాద సంఘటన వెలుగు చూసింది. చిన్నారి తల్లి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు మండలంలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఓ మహిళ ఐదేళ్ల కుమార్తెను ఇంటి వద్ద వదిలి ఈ నెల 24న కూలి పనులకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన బంధువు రాతగిరి శ్రీకాంత్ అనే యువకుడు బైక్‌పై సరదాగా తిప్పుతానంటూ బాలికను నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద వదిలివెళ్లాడు. కూలిపనులకు వెళ్లిన అమ్మ, అమ్మమ్మలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ బాలిక కడుపులో నొప్పి అంటూ ఏడుస్తుండడాన్ని గమనించారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ఖిన్నులైనవారు గ్రామపెద్దలకు సమాచారం అందించారు. గ్రామపెద్దలు, బడా నాయకులు రంగంలోకి రాజీకుదిర్చేందుకు యత్నించారు. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిందితుడు శ్రీకాంత్ పరారయ్యాడు. ఎలాగైనా రాజీ చేయాలని పెద్దలు గుంటూరుకు ఇరువర్గాల వారిని పిలిచి పంచాయితీ చేశారు. తన కుమార్తెకు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బాలిక తల్లి తేల్చిచెప్పింది. పంచాయితీ చేసిన వ్యక్తులు తనను పలురకాలుగా బెదిరింపులకు గురిచేశారు. అప్పుడే జొన్నలగడ్డలోని బాలిక కుటుంబసభ్యులను కలిసిన పోలీసులకు గ్రామపెద్దలు ఒత్తిడి తెచ్చి ఏమి జరగలేదని చెప్పించారు.
దీంతో జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ కుటుంబ సభ్యులు వారంరోజులు మథన పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జొన్నలగడ్డలో ప్రజాచైతన్యభేరి నిర్వహించిన ప్రజాహక్కుల జేఏసీ నాయకులను బాధిత కుటుంబసభ్యులు ఆశ్రయించారు. స్పందించిన జేఏసీ నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి గ్రామ పెద్దలను విచారించారు. నిందితుడు శ్రీకాంత్ బంధువులు వాగ్వాదానికి దిగడం గమనార్హం! జ్వరంతో బాధపడుతున్న బాధిత బాలికను చూసిన జేఏసీ నాయకులు చలించిపోయారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలించడంతో ఔట్‌పోస్టు సిబ్బంది రూరల్ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆస్పత్రికి చేరుకుని బాలిక తల్లి, అమ్మమ్మలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..
బాలికపై అకృత్యానికి పాల్పడిన శ్రీకాంత్‌ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాహక్కుల జేఏసీ కన్వీనర్ జొన్నలగడ్డ వెంకటరత్నం డిమాండ్‌చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు జీజీహెచ్ ఔట్ పోస్టు ఎదుట జేఏసీ సభ్యులు ఆందోళన చేశారు. వారం రోజుల క్రితం చిన్నారిపై అత్యాచారం జరిగినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
Advertisement
Advertisement