ప్రాక్టీసు లా లెసైన్స్ ఇచ్చేస్తా
Published Sat, Jan 18 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
న్యూఢిల్లీ: ప్రాక్టీసు లా లెసైన్స్‌ను ఢిల్లీ బార్ కౌన్సిల్ (బీసీడీ)కు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి సమర్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సోమనాథ్ నుంచి తమకు సమాచారం శుక్రవారం సాయంత్రం అందిందని, ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికెట్‌ను ఇచ్చేయాలని కౌన్సిల్ కోరిందని బీసీడీ కార్యదర్శి మురారీ తివారి తెలిపారు. ఆ సర్టిఫికెట్‌ను సోమనాథ్ సమర్పించినప్పుడు, ప్రక్రియ మొత్తం పూర్తవుతుందన్నారు. ఈ సర్టిఫికెట్ సాధ్యమైనంత తొందరగా వస్తే లెసైన్స్‌ను సస్పెండ్ స్థాయిలో ఉంచుతామని తెలిపారు. న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు పూర్తి చేసుకొని మళ్లీ న్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే అప్పుడు లెసైన్స్‌ను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు.
బీజేపీ నేత గోయల్ ఫిర్యాదుపై ఈ నెల 20న భారతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో బీసీడీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది భారతి వాదించిన ఓ అవినీతి కేసులో సాక్ష్యాలు లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు వ్యాఖ్యలు చేసిందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని భారతిపై చర్య తీసుకోవాలని కౌన్సిల్‌కు ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ గురువారం ఫిర్యాదు చేశారని తెలిపారు. బీసీడీలో పేర్లు నమోదుచేసుకున్న న్యాయవాదులు ఏమైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని తివారి అన్నారు. అలాగే లెసైన్స్ సరెండర్ చేయడంలో ఆలస్యం చేస్తున్న భారతిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టులో ఓ అవినీతి కేసులో బ్యాంక్ అధికారి తరఫున వాదించిన సోమనాథ్ భారతి సాక్ష్యం లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement