తెలంగాణ వారికి ప్రత్యేక ప్యాకేజీ
ఎమ్మెల్యే రేఖా నాయక్ హామీ
బోరివలి, న్యూస్‌లైన్: ముంబైలో స్థిరపడిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుకు కృషిచేస్తానని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే (టీఆర్‌ఎస్) రేఖా నాయక్ హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ముంబై సందర్శించేందుకు వచ్చిన ఆమె తెలుగువారు నివసిస్తున్న పలు ప్రాంతాలను సోమవారం పర్యటించారు. బోరివలి, శాంతాకృజ్‌లలో ఖానాపూర్ నియోజక వర్గం ప్రజలు వేల సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ మురికివాడలలో నివసిస్తున్న తెలంగాణవాసులను చూసి ఆమె చలించి పోయారు.
బోరివలిలోని దౌలత్‌నగర్‌లో ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో వలసవాసుల సమస్యలను లేవనెత్తుతానని, అలాగే వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, సమగ్ర సర్వే రోజున తాము పేర్లు నమోదు చేసుకోలేదని, తమకు రైళ్లు, బస్సుల్లో టికెట్ లభించక పోవడంతో ఆ రోజు సొంత గ్రామాలకు రాలేకపోయామని స్థానికులు కొందరు ఎమ్మెల్యేతో విన్నవించుకున్నారు. కాగా, వీరి కోసం ప్రత్యేకంగా సర్వే నిమిత్తం త్వరలో ఒక తేదీ ప్రకటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
అదేవిధంగా బోరివలిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో తమకు అనుకూలంగా ఉండేలా ఆదిలాబాద్ నుంచి ముంబైకు బస్సు వెయ్యాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి కూడా రేఖా నాయక్ సానుకూలంగా స్పందించారు. మంచిర్యాల డిపో నుంచి బోరివలి వరకు త్వరలో బస్సు ప్రారంభానికి కృషి చేస్తానని తెలిపారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఆమె భర్త శ్యామ్ నాయక్ , ఖానాపూర్ నియోజక వర్గానికి చెందిన గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, రవినాయక్, గాజుల మహేష్, నీరటి మల్లేష్ తదితరులు ఉన్నారు.