‘హోదా’ ఉంటే... ఆ కథే వేరు | special status need for Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఉంటే... ఆ కథే వేరు

Published Sun, Sep 25 2016 2:50 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’ ఉంటే... ఆ కథే వేరు - Sakshi

‘హోదా’ ఉంటే... ఆ కథే వేరు

అసలు వీళ్లనేమనాలి? ‘ప్రత్యేక కేటగిరీ హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువ’ అని చెబుతున్న నేటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి... రాయితీలొస్తున్నాయి కాబట్టే ఉత్తరాఖండ్‌లో సుజనా యూనివర్సల్ ప్లాంటు పెడుతున్నాం... అని గతంలో చెప్పటం అబద్ధమేమీ కాదుగా!! ఎందుకంటే అప్పట్లో ఆయన కంపెనీ చైర్మన్ మాత్రమే. కాబట్టి కంపెనీకి ఏది లాభమనుకుంటే అది చేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు కనక బాబుకు బాజా కొడుతున్నారు.

అలా చెప్పేముందు... తాను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాననే సంగతి ఆయన మర్చిపోయాడా? తెలుగుదేశం ఎంపీగా పార్లమెంటులో సైతం మౌనంగా కూర్చున్న గల్లా జయదేవ్... రాయితీల కోసం ఉత్తరాఖండ్‌లో అమరరాజా బ్యాటరీస్‌కు స్థలం కొన్న మాట అబద్ధమేమీ కాదుగా!! సాక్షాత్తూ ఆయన కంపెనీయే ఆ విషయం స్టాక్ మార్కెట్లకు చెప్పిందికదా!! ఇక టీడీపీకి చెందిన మరో ఎంపీ సి.ఎం.రమేష్... రాయితీల కోసం ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ పరిశ్రమను నడుపుతుండటం పచ్చి నిజమే కదా!! ఇక వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ సీతారామాంజనేయులు... హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లి తన శివశక్తి బయో ప్లాంటెక్ యూనిట్‌ను పెట్టారంటే రాయితీల కోసం కాదా? వీళ్లంతా రాయితీల కోసం ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలకు పరుగులు పెడతారు.

అదే హోదా ఏపీకి వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుందని ఎవరైనా నినదిస్తే... అబ్బే! ‘ఆ హోదాతో నష్టమే తప్ప లాభమేమీ ఉండదు!!’ అని సర్దిచెప్పబోతారు. ఇదెక్కడి నీతి? వీళ్లనసలు ప్రజా ప్రతినిధులని అనొచ్చా?!! కావాలంటే మీరే చూడండి. ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఎలా బాగుపడ్డాయో, అసలు పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు వస్తాయో చూడండి!! సాక్షాత్తూ కేంద్ర మంత్రులే ఆ రాష్ట్రాలు హోదాతో బాగుపడ్డాయని చెబుతున్నారు. మన పారిశ్రామికవేత్తలు హోదాతో తప్ప భవిష్యత్తు లేదని గొంతెత్తి నినదిస్తున్నారు.
ఆ నినాదాలపైనే ఈ ‘ఫోకస్’
 

హిమాచల్‌ప్రదేశ్.. అన్నీ కొండలే.. పెపైచ్చు మిగతా రాష్ట్రాలకు దూరంగా... చైనా సరిహద్దులో... హిమాలయాల చెంత ఉంటుంది. వర్షాకాలంలోనో, చలికాలంలోనో అక్కడున్న కొన్ని ప్రాంతాలకు వెళ్లటం కూడా అసాధ్యం. జలవిద్యుత్, టూరిజంకు తప్ప మిగతా పరిశ్రమలకు పెద్ద అనుకూలమైనదేమీ కాదు.

కానీ... రాష్ట్రానికి చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, జెన్ టెక్నాలజీస్ వంటి సంస్థలు అక్కడ తయారీ యూనిట్లు పెట్టుకున్నాయి. ర్యాన్‌బాక్సీ, సిప్లా, టోరెంట్, పనాసియా, క్యాడిలా వంటి ఫార్మా దిగ్గజాలు కూడా అక్కడ కొలువుతీరాయి. ఇవేనా!! నెస్లే, డాబర్, బిర్లా, వర్ధమాన్, బ్లూస్టార్, టీవీఎస్ మోటార్స్, ఏసీసీ, అంబుజా, అల్ట్రాటెక్, జేపీ, మైక్రోటెక్, స్పైస్ మొబైల్స్... ఇలాంటి దిగ్గజ కంపెనీలన్నీ అక్కడ యూనిట్లు ఏర్పాటుచేశాయి. ఎందుకని? అక్కడ పెట్టాల్సిన అవసరం వీటికి ఏమొచ్చింది? లాభమేంటి?

ఉత్తరాఖండ్‌దీ అదే పరిస్థితి. దాన్నిండా కూడా పర్వతాలే. స్థానికుల ఆకాంక్ష మేరకు ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయాక పరిస్థితి మరీ ఘోరం. ఒకవైపు చైనా, నేపాల్... మరోవైపు హిమాచల్, ఉత్తరప్రదేశ్. కనెక్టివిటీ చాలా తక్కువ. హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి ప్రాంతాలతో ఆధ్యాత్మిక పర్యాటకం తప్ప మిగతా పరిశ్రమలకు అనుకూల వాతావరణమేమీ లేదు.

కానీ హిల్ట్రాన్, హెచ్‌సీఎల్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలతో పాటు బ్రిటానియా, పెప్సీకో వంటి ఫుడ్‌ప్రాసెసింగ్ లీడర్లు... ఐటీసీ, డాబర్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు... మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బీహెచ్‌ఈఎల్, హావెల్స్, సూర్య రోష్ని వంటి భారీ ఆటో, ఇంజినీరింగ్ పరిశ్రమలూ కొలువు దీరాయి. ఎందుకని? అంతదూరంలో పెడితే వాటికేం లాభం? ముడిసరుకు తేవటం, ఉత్పత్తిని బయటకు పంపటం మామూలుగా అయ్యే పనా? భారీ రవాణా ఖర్చుల్ని కూడా భరించి ఎందుకు కొనసాగుతున్నాయి? ఉత్తరాఖండ్ మీద వాటికి అంత ప్రేమెందుకు? వాటికి లాభమేంటి?

పరిశ్రమల విషయానికొస్తే గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. అరుదైన సందర్భాల్లో తప్ప ఏ కంపెనీకీ ఏ ప్రాంతంపైనా ప్రత్యేకంగా ప్రేమగానీ, ద్వేషంగానీ ఉండవు. వాటిక్కావాల్సింది లాభం. పెట్టుబడి పెట్టేముందు... అక్కడ ఏ రాయితీలిస్తున్నారు? ప్రోత్సాహకాలేంటి? వాటివల్ల తమకు తక్షణం కలిగే ప్రయోజనమేంటి? దీర్ఘకాలంలో వచ్చే లాభమెంత? అక్కడ యూనిట్ పెడితే పెరిగే ఖర్చులేంటి? ఇవన్నీ బేరీజు వేసుకుంటాయి. లాభం క నిపిస్తే... అక్కడ వెంటనే వాలిపోతాయి.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిందదే. 2003 వరకూ ఈ రెండు రాష్ట్రాలదీ వెనకబాటే. కానీ 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ రెండు రాష్ట్రాల్లోనూ పర్యటించి... వీటికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని 2003 నుంచీ అమలు చేశారు. ప్రత్యేక హోదా ఫలితంగా ఈ 2రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు భారీ ఎత్తున రాయితీలొచ్చాయి. ఆదాయ పన్ను సహా సుంకాలను మినహాయించారు. పెట్టుబడులకు సబ్సిడీ ఇచ్చారు. ఔత్సాహికులు పారిశ్రామిక వేత్తలుగా మారటానికి పథకాలు పెట్టారు. ఫలితం... భారీ ఎత్తున  పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలొచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలు అతివేగంగా వృద్ధి చెందాయి. కోటి మంది జనాభా ఉన్న ఉత్తరాఖండ్‌లో 30వేలకు పైగా  కొత్త పరిశ్రమలు.. 68 లక్షల జనాభా ఉన్న హిమాచల్‌లో 10వేలకు పైగా పరిశ్రమలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
 
 మరి ఆంధ్రప్రదేశ్ సంగతేంటి? 
ఐదు కోట్ల జనాభా.. వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం... పలు జిల్లాల్లో విలువైన నిక్షేపాలు... రాష్ట్రంలోని ఏ మూలకైనా, ఎలాంటి సీజనో్లైనైనా వెళ్లగలిగే కనెక్టివిటీ, విసృ్తతమైన రవాణా సౌకర్యాలు... అన్నీ సానుకూల అంశాలే. కాకుంటే అభివృద్ధికి చిరునామా లాంటి రాజధాని విడిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో పడింది. ఐటీ హబ్‌లు, ఫార్మా క్లస్టర్లు, భారీ పరిశ్రమలు... అన్నీ విడిపోయిన రాజధానిలోనే ఉండిపోయాయి. అవేవీ కూడా ఇపుడు తాడూ బొంగరం లేని ఏపీవైపు చూడటమే లేదు. యువతకు ఇంటర్వ్యూ పిలుపులే లేవు.
 
 కారణం ఒక్కటే. కొత్త పరిశ్రమ పెట్టాలనుకున్న వారైనా... పరిశ్రమను విస్తరించాలనుకున్నవారైనా ఆలోచించేది ఎన్నాళ్లలో, ఎంత లాభం వస్తుందనే...!! మరి అలాంటి వారికి ఏపీలో పరిశ్రమ పెడితే ఏం లాభం? ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేదా? పెట్టుబడిలో సబ్సిడీ ఇస్తున్నారా? రాబోయే జీఎస్‌టీ  నుంచిఏపీ కంపెనీలను మినహాయిస్తామని చెప్పారా? అవేమీ లేవు. ఇవన్నీ కావాలంటే ప్రత్యేక హోదా ఉండాలి మరి!!
 
   మన్మోహన్‌జీ హోదా ఇస్తామన్నది అందుకే...  
 విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా అవసరమని భావించబట్టే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ఆ హోదాను ఇస్తామన్నారు. పార్లమెంటులోనే ప్రకటించారు కూడా. ఏపీ బాగుపడాలంటే ఆ హోదా తప్పనిసరని భావించబట్టే నాడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు కూడా ఆ హోదాను పదేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు చాలదన్నారు. ఏపీ అభివృద్ధికి అదొక్కటే మార్గమని అక్కడి ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని గ్రహించే... నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో దాన్ని తారకమంత్రంలా జపించారు.

తాము గెలిస్తే ప్రత్యేక హోదా ఖాయమన్నారు. మరి ఇద్దరూ గెలిచారు. మరి ఇపుడు జనం ఓడిపోవాలా? ప్రత్యేక హోదా పరాజయం పాలవ్వాలా? ఏరు దాటాక తెప్ప తగలేస్తారా? హోదా వస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువంటున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి తాము దేన్ని తాకట్టు పెడుతున్నారో కొంచెమైనా గ్రహించారా? రాష్ట్రాన్ని ఉరికొయ్య ముందు నిల్చోబెడుతున్నట్లు వీరికి అనిపించటం లేదా?


 హోదా ఉంటే అధిక నిధులు!
 మామూలుగా కేంద్రం ప్రత్యేక ప్రణాళిక మద్దతు కింద రాష్ట్రాలకు నిధులిస్తుంది. వీటిలో 30 శాతాన్ని ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేటాయించి, మిగిలిన 70 శాతాన్ని అన్ని రాష్ట్రాలకూ పంచుతుంది. వాటిలో కూడా మిగతా రాష్ట్రాలకిచ్చే నిధుల్లో గ్రాంటు 60 శాతంగా ఉంటుంది. ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకైతే 90 శాతం గ్రాంటుగా వెళుతుంది. ఇదెంత లాభమో తెలియటం లేదా?

పరిశ్రమలకొచ్చే రాయితీలివీ...
 ఇదిగో... ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల జాబితాలోకి చేరుస్తూ కేంద్రం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2003 జనవరి 7న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటయ్యే, స్థానికంగా ఉండి అక్కడే విస్తరణ చేపట్టే పరిశ్రమలకు పలు మినహాయింపులు, రాయితీలు ప్రకటించింది. నెగెటివ్ లిస్టులో ఉండే రంగాలు,  ప్రాంతాలకు మాత్రం ఇవి వర్తించవు. ఆ వివరాలు...

ఇదిగో... వృద్ధికి సాక్ష్యాలు...
 ఈ రాయితీలు, ప్రోత్సాహకాల ఫలితంగా ఏం జరిగిందనేది ఈ ఏడాది మార్చిలో సాక్షాత్తూ  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. రాజ్యసభలో సభ్యుడు కె.సి.త్యాగి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఏం చెప్పారంటే...

  ‘‘హిమాచల్ ప్రదేశ్‌కు హోదా ఇచ్చాక...  
 ఈ 13 సంవత్సరాల్లో దాదాపు 10,864 పరిశ్రమలు
 కొత్తగా ఏర్పడ్డాయి. రూ.15,324.25 కోట్ల పెట్టుబడులొచ్చాయి.
 ఈ పరిశ్రమల ద్వారా 1,29,443 మందికి  ఉద్యోగాలు లభించాయి’’.
 దీనర్థం 68 లక్షల జనాభా ఉన్న హిమాచల్‌లో...
 ఈ హోదా కారణంగా రెండు శాతం మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించినట్టేగా!!.
 ‘‘ఉత్తరాఖండ్‌లో ఈ 13 సంవత్సరాల్లో 30,224 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి.
 వీటి కోసం రూ.35,343.41 కోట్ల పెట్టుబడులొచ్చాయి.
 
   ఈ కంపెనీల్లో 2,45,573 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయి.’’  
 మరి ఉత్తరాఖండ్‌ను చూసినా అక్కడి జనాభా దాదాపు కోటి. ఈ హోదా కారణంగా వారిలో 2.45 శాతం మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలొచ్చాయి. ఏపీకి హోదా ఇస్తే ఇక్కడి కనెక్టివిటీ, వనరుల దృష్ట్యా ఎన్ని పరిశ్రమలొస్తాయో, ఎన్ని లక్షల మందికి నేరుగా ఉద్యోగాలొస్తాయో ఆలోచించటం కష్టమా?

  1) 2003 జనవరి 7 తరువాత వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే... నాటి నుంచీ పదేళ్ల పాటు నూరు శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు  
 
ఈ మినహాయింపునకు ఎలాంటి పరిమితీ ఉండదు. నియంత్రణలేమీ ఉండవు. ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేసే సంస్థకైనా... ఎంత విలువకైనా వర్తిస్తుంది.
 
2)   తొలి ఐదేళ్ల పాటు ఆదాయం పన్ను పూర్తిగా మినహాయింపు. ఆ తరువాత ఐదేళ్ల పాటు కంపెనీలకు 30 శాతం, కంపెనీలు కానివాటికి 25 శాతం మినహాయింపు.  
 
దేశంలో కంపెనీలు ఆర్జించే లాభాలపై 25 శాతం కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించాలి. అదే పెద్ద కంపెనీలైతే (టర్నోవర్ రూ.కోటి దాటితే) 5 శాతం సర్‌చార్జి కూడా ఉంటుంది. అంటే రూ.5 కోట్లు లాభం ఆర్జిస్తే 1.5 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్న మాట. దీన్ని ఐదేళ్లపాటు పూర్తిగా మినహాయించారు. మరో ఐదేళ్లపాటు చెల్లించాల్సిన మొత్తంలో 70 శాతం చెల్లిస్తే చాలు. కంపెనీలకు ఇది చాలా పెద్ద ఊరట. అందుకే నెస్లే, డాబర్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్ వంటి సంస్థలతో పాటు భారీ ఫార్మా కంపెనీలన్నీ ఈ రెండు రాష్ట్రాల్లో కొలువు దీరాయి.
 
   3) పదేళ్ల పాటు అమ్మకం పన్ను  మినహాయింపునిచ్చారు.
 హిమాచల్‌కు 2003లో హోదా ఇచ్చినపుడు అమ్మకం పన్ను 4%గా ఉండేది. అందుకని చాలా కంపెనీలు లాభపడ్డాయి. నిజానికి చాలా కంపెనీలు ఎమ్మార్పీ కన్నా చాలా తక్కువకే రిటెయిలర్లకు వస్తువులు విక్రయిస్తుంటాయి. కానీ అవి పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు ఎమ్మార్పీపై చెల్లించాలి. కొన్ని కాంట్రాక్టు మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థలకు ఇది తలనొప్పే. ఎందుకంటే అవి రూ.100  ఎమ్మార్పీ ఉన్న వస్తువును తమ కాంట్రాక్టు సంస్థకు రూ.10-20కే విక్రయిస్తుంటాయి. కానీ పన్ను మాత్రం రూ.100పై చెల్లించాలి. ఇది చాలా ఇబ్బంది. తర్వాత కేంద్రం అర్థం చేసుకుని 30 శాతాన్ని వదిలి, మిగిలిన 70 శాతం ఎమ్మార్పీపైనే ఈ పన్ను చెల్లించాలని పేర్కొంది. అదీ వీటికి ఎక్కువే. ఇలాంటి సంస్థలకు హిమాచల్ వరంగా మారింది.
 
 4)   ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పాటైన పరిశ్రమలకు ప్లాంటు, యంత్రాలపై అవి పెట్టే పెట్టుబడిలో 15 శాతాన్ని క్యాపిటల్
 ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీగా వెనక్కిస్తారు.
 
దీని గరిష్ట పరిమితి రూ.30 లక్షలు. ప్రస్తుత యూనిట్లు గనక విస్తరణ చేపడితే వాటికీ వర్తిస్తుంది. ఇది 2003 నుంచి పదేళ్ల పాటు అమల్లో ఉంది.
 ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ పథకాన్ని 2013 జనవరి 6 నుంచి.. 2017 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం  2014లో ప్రకటించింది. చిన్న కంపెనీలకు ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ 15% లేదా 30 లక్షలు. అదే ఎంఎస్‌ఎంఈలకైతే 15%లేదా 50 లక్షలు. కాకుంటే 70% ఉద్యోగాలు స్థానికులకిస్తేనే ఇది వర్తిస్తుంది.


 ప్రత్యేక హోదా... ఇతర ప్రోత్సాహకాలివీ..  
 జౌళి మంత్రిత్వ శాఖ దీన్‌దయాళ్ హత్‌కర్గా ప్రోత్సాహన్ యోజనను అమలు చేస్తోంది. దీనికింద రాష్ట్రాలు 50శాతం నిధులు సమకూరిస్తే, కేంద్రం 50 శాతం ఇస్తుంది. కానీ ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం ఇస్తుంది. రాష్ట్రాల వాటా 10 శాతం ఉంటే చాలు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ: ప్రత్యేక కేటగిరీ హోదా ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలనూ క్లిష్టమైన ప్రాంతాల జాబితాలో చేర్చింది. వాటికిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను వీటికీ వర్తింపజేసింది.

ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై) కింద వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ హిమాచల్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లోని అర్హుల వయసును సడలించింది. మిగతా రాష్ట్రాల్లో 18-35 ఏళ్లుగా ఉండగా... ఇక్కడ 18-40. సబ్సిడీని కూడా రూ.15,000 లేదా ప్రాజెక్టు వ్యయంలో 15%గా నిర్ణయించారు.
 
 గ్రోత్ సెంటర్ల ఏర్పాటు పథకం కింద మిగతా రాష్ట్రాలకు కేంద్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ హోదా ఉన్న రాష్ట్రాలకు రూ.15 కోట్లు చేశారు.
 
ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు (ఐఐడీసీ) కేంద్ర ప్రభుత్వం, సిడ్బీ 2:3 నిష్పత్తిలో నిధులందించేవి. ఈ 2 రాష్ట్రాలకూ దీన్ని 4:1గా సవరించారు. కేంద్ర నిధులు గ్రాంటు రూపంలో అందుతాయి. దీంతో కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవచ్చు.
 

 వివిధ రంగాల్లో అగ్రగామి సంస్థలివీ...


 ఫుడ్ ప్రాసెసింగ్: నెస్లే, డాబర్, క్రెమియా గ్రూప్, అదానీ అగ్రి ఫ్రెష్, డీఎస్ గ్రూప్,  మహాన్, హిమాలయన్ ఆర్గానిక్స్
 ఫార్మా: రాన్‌బ్యాక్సీ, సిప్లా, టోరెంట్, డాక్టర్ రెడ్డీస్, పనాసియా బయోటెక్, గోపాల్ లైఫ్ సెన్సైస్, మోర్పెన్ ల్యాబ్స్, మాన్‌కైండ్ ఫార్మా, ఫెమ్ కేర్, ఇండోకో రెమిడీస్, ప్రోమెడ్, ఆల్కెమ్ ల్యాబ్స్, డాబర్, జైడస్ క్యాడిలా...

టెక్స్‌టైల్స్: బిర్లా, వర్ధమాన్, మాల్వా కాటన్, హిమ్‌టెక్స్, సారా టెక్స్‌టైల్స్, హిమాచల్ ఫైబర్, నిర్మల్ ఫర్నిషింగ్..
 లైట్ ఇంజినీరింగ్ గూడ్స్: గ్యాబ్రియెల్, ప్యూరోలేటర్, ఇంటర్నేషనల్ కార్స్ అండ్ మోటార్స్, బ్లూ స్టార్, స్ప్రే ఇంజినీరింగ్ డివెజైస్, టీవీఎస్ మోటార్స్...
 సిమెంట్స్: ఏసీసీ, అంబుజా, జేపీ.. ఐటీ: హెచ్‌ఎఫ్‌సీఎల్,  మైక్రోటెక్, ల్యూమినస్, స్పైస్ మొబైల్. వెప్ పెరిఫెరల్స్
 టూరిజం...: దాదాపు ఐదు జిల్లాల్లోనే 1,550 రిజిస్టర్డ్ హోటళ్లున్నాయి.
 
 వివిధ రంగాల్లో దిగ్గజ సంస్థలివీ...


 ఐటీ-కమ్యూనికేషన్: హిల్ట్రాన్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, విప్రో ఇన్ఫోటెక్, మోడీ ఇన్ఫోటెక్ సర్వీసెస్
 అగ్రో- ఫుడ్ ప్రాసెసింగ్: బ్రిటానియా, నెస్లే, పెప్సికో, కేఎల్‌ఏ ఫుడ్స్
 ఎఫ్‌ఎంసీజీ: ఐటీసీ, డాబర్, కెవిన్ కేర్, హిందుస్థాన్ యూనిలీవర్
 ఆటో- ఇంజనీరింగ్: టాటా, బీహెచ్‌ఈఎల్, పోలార్ ఇండస్ట్రీస్
 టూరిజం: దాదాపు ఐదువేల హోటళ్లు, రెస్ట్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు.
 
ఇదీ... హోదా కథ
ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉండగా... ఈశాన్య రాష్ట్రాలకు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు కలిపి మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా ఉంది.  దీన్ని ఏ రాష్ట్రాలకిస్తారంటే...

 పర్వతాలు, ఎత్తై భూభాగాల్లో ఉన్న రాష్ట్రాలకు
 అధిక గిరిజనులు, తక్కువ జనాభా ఉన్నవాటికి
 దేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు
 మౌలిక వసతులతో పాటు ఆర్థికంగా
 బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు

ఈ లెక్కన చూసుకున్నపుడు చివరి అంశం ఆంధ్రప్రదేశ్‌కు సరిగ్గా సరిపోతుంది. విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలహీనంగా మారుతుందని తెలుసు కనకే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ హోదాను ఇస్తామని చెప్పారు.

నిజానికి 2002లో ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలను సందర్శించాక వాటికి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని వాజ్‌పేయి హామీనిచ్చారు. ఆ మేరకే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం ఇక్కడ గమనార్హం.

భవిష్యత్తు దారుణం
 పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు లేకపోతే పారిశ్రామిక రంగ భవిత దారుణంగా ఉంటుంది. కనీసం ఇప్పుడైనా రాయితీలు ప్రకటిస్తే మరో రెండేళ్లకైనా పరిశ్రమలు ఏర్పడి ఉపాధి లభించే అవకాశం ఉండేది. రాయితీలు లేకపోతే చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్‌లోనూ కొత్త పెట్టుబడులొచ్చే అవకాశం లేదు. ఈ కారిడార్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి ఉంది కనక రాయితీలు లేకుంటే కొత్త పెట్టుబడులు ఆ రెండు రాష్ట్రాలకే వెళ్తాయి.
 - శివకుమార్, చైర్మన్, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్
 
   ఎన్ని దేశాలు తిరిగినా శూన్యమే..  
 ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. కానీ దాన్లో ఎక్కడా పారిశ్రామిక రాయితీల ఊసే లేదు. రాయితీల కోసం మన రాష్ట్రానికి చెందిన చాలా కంపెనీలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్లు ఏర్పాటు చేశాయి. అదే మన రాష్ట్రానికి రాయితీలిస్తే పారిశ్రామిక విప్లవం వస్తుంది. పెట్టుబడుల కోసం సీఎం అనేక దేశాలు తిరిగినా ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు.    
- ముత్తవరపు మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్
 
   హోదా ఉంటే పరిశ్రమలొస్తాయి..  
 పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి కనుక హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. కొత్తగా విస్తరణకు వెళ్లాలనుకునే కంపెనీలు ఈ బెనిఫిట్స్ కోసం చూస్తాయి. హిమాచల్, ఉత్తరాఖండ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలు, దక్షిణాదికి చెందిన పలు సంస్థలు ప్లాంట్లను పెట్టాయి. ఇలాంటివి సహజంగానే ఎక్కడ మేలు జరుగుతుందా అని చూస్తాయి. - రమేష్ దాట్ల, చైర్మన్, సీఐఐ దక్షిణ ప్రాంతం

- మంథా రమణమూర్తి (ramanamurthy@sakshi.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement