దళపతి రాజీనామా?
సాక్షి, చెన్నై : డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారని ఆది వారం పత్రికలో వచ్చిన వార్తలు ఆ పార్టీ లో కలకలాన్ని రేపాయి. ఆళ్వార్ పేట లోని దళపతిగా పేరొందిన స్టాలిన్ ఇంటికి ఆయన మద్దతు దారులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పరుగులు తీశారు. ఇదంతా దుష్ట శక్తుల కుట్ర అని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దంటూ స్టాలిన్ వివరణ ఇచ్చారు. అధినేత కరుణానిధితో మంతనాల్లో మునిగారు.
డీఎంకేలో సంస్థాగత ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు వర్గం తీవ్ర ఇబ్బం దుల్ని ఎదుర్కొని అనేక ఆంక్షల నడుమ జిల్లా కార్యదర్శుల పదవుల్ని చేజిక్కిం చుకున్నాయి. అధిష్టానం నిర్ణ యం శిరోధార్యంగా స్టాలిన్ భావించినా, మద్దతు దారులకు జరుగుతున్న అన్యాయంపై ఆయన అసంతృప్తితో ఉన్నారన్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల ఎంపికకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందు కోసం ఈనెల 9న డీఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల నిమిత్తం ఏడో తేదీన నామినేషన్లను సమర్పించాల్సి ఉంది.
రాజీనామా:
కరుణానిధి రాజకీయ వారసుడిగా స్టాలిన్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ పదవి స్టాలిన్‌కు దక్కవచ్చన్న ఆశాభావంతో ఆయన మద్దతుదారులు ఉన్నారు. ఇదే విషయంగా అధినేత కరుణానిధితో స్టాలిన్ మంతనాలు జరిపినట్టు, ఇందుకు ఆయన నిరాకరిం చినట్టు సమాచారం. కరుణ ఆజ్ఞను ధిక్కరించి ప్రధాన కార్యదర్శి పదవికి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేయడంతో పాటుగా, పార్టీ కోశాధికారి పదవికి రాజీనామా చేసినట్టుగా కొన్ని మీడియాల్లో వార్తలు రావడం డీఎంకేలో కలకలం రేపింది.
పరుగు...:
తన పదవికి స్టాలిన్ రాజీనామా చేశారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆయన మద్దతుదారులు ఆళ్వార్ పేటకు పరుగులు తీశారు. ఆయన ఇంట్లో గంటకు పైగా మంతనాలు సాగాయి. స్టాలిన్ రాజీనామా వాస్తవమేనా..? అని తెలుసుకునేందుకు మీడియా సైతం ఉరకలు తీసింది. అధినేత కరుణానిధి మీదున్న కోపం, తన మద్దతుదారులకు జరిగిన అన్యాయంపై ఉన్న అసంతృప్తితోనే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారంటూ మరో ప్రచారం బయలు దేరింది. ఈ చర్చకు ముగింపు ఇచ్చే విధంగా కాసేపటికి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు.
దుష్ట శక్తుల కుట్ర :
డీఎంకే సంస్థాగత ఎన్నికల పర్వం విజయవంతంగా చివరి దశకు చేరిందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక, పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవికి ఎన్నికలు జరగాల్సి ఉందన్నా రు. ఈ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీకి అధ్యక్షుడిగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శిగా అన్భళగన్, కోశాధికారిగా తాను మళ్లీ పోటీ చేయబోతున్నామని వివరించారు. డీఎంకేలో కలకలాన్ని రేపడం లక్ష్యంగా దుష్ట శక్తులు కుట్ర చేశాయని మండిపడ్డారు. అనంతరం నేరుగా సీఐటీ కాలనీ చేరుకుని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటుగా సాగిన ఈ మంతనాల్లో ఆంతర్యమేమిటోనన్నది గమనార్హం.
నేను రెడీ :
స్టాలిన్ రాజీనామా ప్రచారం ఎపిసోడ్ సాగుతున్న సమయంలో చెన్నైకి డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే విధం గా సామరస్య పూర్వక బుజ్జగింపుల ప్రయత్నాలు సాగుతున్నారుు. ఈ పరిస్థితుల్లో చెన్నైకి వచ్చిన అళగిరి డీఎంకేలో మళ్లీ చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ఉదయం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేలో అనేక తప్పులు జరిగాయని, వాటన్నింటిని సరిదిద్ధుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అన్ని సక్రమంగా జరిగిన పక్షంలో మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లడానికి తాను రెడీ అని అళగిరి వ్యాఖ్యానించడం విశేషం.