పాల ‘పిడుగు’
Published Fri, Jan 3 2014 12:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
కొత్త ఏడాదిలో గ్యాస్ ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, పాల ధర పెంచుతూ సహకార సంఘాలు పాల ధరను పెంచేశాయి. లీటరు పాలకు రెండు నుంచి నాలుగు రూపాయల వరకు పెంచేసి విక్రయించడం గమనార్హం. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరల పిడుగును ఎలా తట్టుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా విని యోగదారులకు పాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆవిన్ ద్వారా సరఫరా సాగుతోంది. సహకార సంఘాలు పాడి రైతుల నుంచి పాలను సేకరించి ఆవిన్‌కు అందజేస్తాయి. కొందరు రైతులు తమ పాల దిగుబడిని శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసుకుని క్యాన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు ఆవుపాలు లీటరు 21కే అమ్మారు. జనవరి 1వ తేదీ నుంచి లీటరుకు 2, 3, మరికొన్ని చోట్ల 4లు పెంచి అమ్మారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఆవుపాలు లీటరు 23 నుంచి 25 వరకు అమ్ముతున్నారు.
పాలసేకరణ ధరను పెంచాలని రాష్ట్రంలోని పాడిరైతులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి కోరికమేరకు ప్రభుత్వం ఇటీవలే పాలసేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై 3 పెంచింది. సేకరణ ధరను పెంచినా వినియోగదారులపై ఆ (కొనుగోలు)భారం మోపబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం పెంచిన ధర ఎంత మాత్రం సరిపోదంటూ రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తిని నిలిపివేసి ఫిబ్రవరి మూడో వారం నుంచి ఆందోళనకు పూనుకుంటామని పిలుపునిచ్చారు. తిరువారూరు జిల్లా మన్నార్‌కుడిలో పాల అమ్మకందారుల సంఘాలున్నాయి. వీరు ఇల్లిల్లూ తిరిగి పాలను సేకరించి మన్నార్‌కుడిలోని పాలశీతల కేంద్రంలో నిల్వ చేసుకుంటారు.
ఆ తరువాత పాలను క్యాన్లలో పెట్టుకుని వినియగదారులకు సరఫరా చేస్తారు. వీరంతా వినియోగదారులకు హెచ్చుధరకు పాలు సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన పాల ధర తమకు ఎంతమాత్రం గిట్టుబాటు కాదని పాడి రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పాలను అమ్మితే పాల సొసైటీలను ఎంతమాత్రం నడుపలేమని చెప్పారు. దీంతో పాల ధరను పెంచక తప్పలేదని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పాలధర పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేకరణ ధరను పెంచినా అమ్మకం ధరను పెంచబోమని సీఎం ఇచ్చిన హామీకి విరుద్ధంగా పాలను హెచ్చు ధరకు అమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఏమాత్రం ముందు ప్రకటనలు లేకుండా పెంచిన ధరను వెంటనే అమలు చేయడంపై మండిపడుతున్నారు.
Advertisement