వర్షాలు ఆపండి, తర్వాత అడగండి
విలేకరులపై ఉద్ధవ్ థాక్రే చిర్రుబుర్రు
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు కోపం వచ్చింది. ముంబై వర్షాలపై ప్రశ్నలు అడిగిన విలేకరులపై చిర్రుబుర్రులాడారు. తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ఎంసీజీఎం(మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై)లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకుండా విలేకరులపై ఎదురుదాడికి దిగారు.
'ముందు మీరు వర్షాలు రాకుండా ఆపండి. తర్వాత ఏం చేయాలో నన్ను అడగండి. ముంబై నగరంపై మీకు ఒక్కరికే గుత్తాధిపత్యం ఉందని భావించకండి. మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. అందుకే ఎన్నికల్లో మాకు ఓటు తిరిగి అధికారంలోకి తెచ్చార'ని థాక్రే అన్నారు. చాలా ఏళ్లుగా ఎంసీజీఎం శివసేన పాలనలో ఉందని, వర్షాలకు ప్రతి సంవత్సరం నగరం ఎందుకు మునిగిపోతోందని విలేకరులు ప్రశ్నించారు. వరదల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎంసీజీఎం చెబుతోందని, కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని ఆక్షేపించారు.
దీనిపై థాక్రే స్పందిస్తూ.. 'మీడియా కంటే ప్రజలతోనే మేము మమేకమవుతున్నాం. మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సహాయం చేస్తున్నారు. కానీ మీరు ఏమీ చేయడం లేద'ని జవాబిచ్చారు. ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తప్పుబట్టారు. థాక్రే అహంకారంతో మాట్లాడారని, వరద బాధిత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.