నకిలీ తాళంతోనే సైకో పరార్ | Sycho with a duplicate key to the parar | Sakshi
Sakshi News home page

నకిలీ తాళంతోనే సైకో పరార్

Published Sun, Sep 8 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

Sycho with a duplicate key to the parar

బెంగళూరు, న్యూస్‌లైన్ : ఉన్మాది జయ శంకర్ జైలు నుంచి తప్పించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికను రచించాడు. జైలులో పని చేస్తున్న ఒకరిద్దరు సిబ్బంది కూడా అతనికి సహకరించినట్లు తెలిసింది. నకిలీ తాళం ద్వారా అతను గేటు తెరచుకుని పారిపోయాడని తాత్కాలికంగా నిర్ధారణ అయింది. దీని కోసం అతను సెల్లార్ 26 వద్ద పని చేస్తున్న వార్డర్ సహాయం కూడా తీసుకున్నాడు. రూ.వెయ్యి లంచం ఇవ్వడంతో ఆ వార్డరే నకిలీ తాళం చేయించి ఇచ్చాడని సమాచారం.

ఆ వెయ్యి రూపాయలను కూడా శంకర్ కంతుల్లో చెల్లించాడని తెలిసింది. పైగా వార్డర్, జయ శంకర్ తరచూ మందు కొట్టేవారనే విషయం కూడా బయటపడింది. పారిపోవడానికి ముందు జయ శంకర్ నకిలీ తాళాన్ని పలు మార్లు పరీక్షించినట్లు సమాచారం. ఆగస్టు 31వ తేది అర్ధరాత్రి నుంచి భారీ వర్షం రావడంతో ఇదే అదను అని భావించాడు. జైలు సిబ్బంది నిద్రపోయే వరకు వేచి ఉన్నాడు. తరువాత తాళం తీసి సెల్లార్ నుంచి బయటకు వచ్చాడు. నకిలీ తాళాన్ని గార్డెన్‌లో విసిరి వేశాడు.

అక్కడి నుంచి 15 అడుగుల గోడ మీదుగా సమీపంలోని 20 అడుగుల గోడ వద్దకు చేరుకున్నాడు. తరువాత 30 అడుగుల గోడ మీదకు దుప్పటిని తాడుగా ఉపయోగించి ఎక్కాడు. అక్కడి నుంచి గోడ మీద విద్యుత్ సరఫరా కావడానికి వేసిన ఇనుప రాడ్‌కు బెడ్‌షీట్ కట్టి జైలు ఆవల దిగడానికి ప్రయత్నించి కింద పడిపోయాడని సమాచారం. కాగా నకిలీ తాళం ఇచ్చిన వార్డర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని జైళ్ల శాఖ ఏడీజీపీ గగన్‌దీప్ తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి జయ శంకర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించారు. తప్పించుకునే ప్రయత్నంలో జయ శంకర్ వెన్నుపూస దెబ్బతింది. దీనికి తోడు జైలు నుంచి పారిపోయినప్పటి నుంచి ఐదు రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతను కోలుకున్న తర్వాత దర్యాప్తు ప్రారంభమవుతుందని పోలీసులు శనివారం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement