
తిరిగి జైలు తలుపులు తట్టిన తాజ్
సత్‌ప్రవర్తన జాబితాలో మైసూరు జైలు నుంచి విడుదలైన తాజ్ శిరిన్
సొంత ఊళ్లో నా అన్న వాళ్లు కనిపించని వైనం
తిరిగి జైలు తలుపులు తట్టిన తాజ్
మైసూరు : జైలు నుంచి విడుదలైన ఓ మహిళ 24 గంటల్లోనే మళ్లీ జై లు తలుపులు తట్టడంతో అధికారులు విస్తుపోయిన ఘటన బుధవారం మైసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లా శ్రీరంగ పట్టణానికి చెందిన తాజ్ శిరిన్ (44)కు 2002లో భర్తను హత్య చేసిన ఘటనలో న్యాయస్థానం కారాగార శిక్ష విధించింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో తాజ్ శిరీన్ కూడా ఉంది. ఆమె కూడా విడుదలై బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. తన ఊరిని వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడే ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోగా తన వాళ్లు, తన కుటుంబ సభ్యులు, చివరికి ఊరిలో గుర్తు పట్టేవాళ్లు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది.
జైలుకు వెళ్లినపుడు ఆమె తల్లిదండ్రులు, వారితోనే ఉన్న ఆమె ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లేవారు. కానీ ఆమెకు వారి జాడ తెలియకపోవ డంతో గ్రామస్తులను ఆరా తీసింది. విచారించగా ఆమె తండ్రి మృతి చెందిన అనంతరం తల్లి పిల్లలతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోయిందని చెప్పారు.
తల్లి, పిల్లలు ఎక్కడికెళ్లారో, ఏమయ్యారో తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజే అక్కడినుంచి తిరుగు ప్రయాణమై జైలు తలుపు తట్టింది. ఊహించని ఘటనను ఎదుర్కొన్న జైలు అధికారులు ఆమెను నగరంలోని శక్తిధామం అనాథ శరణాలయంలో చేర్చారు.