ఉసురు తీసిన ఈత సరదా
Published Mon, Aug 26 2013 6:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: ఈత సరదా ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది. కాంచీపురం సమీపంలోని చిట్టికారై గ్రామంలోని చెరువులో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు మృతి చెందారు. కాంచీపురం సమీపంలోని చిట్టికారై ప్రాంతానికి సమీపంలోని సిరువాలూర్ గ్రామానికి చెందిన రైతు కూలీ వెంకటేశన్ అతని కుమార్తె షాలిని కాంచీపురంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన భూపాలన్ కుమార్తె ధనలక్ష్మి ఏడవ తరగతి, ఏకాంబరం అనే వ్యక్తి కుమార్తె అజిత పారానత్తూర్‌లోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుతోంది.
ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ముగ్గురు బాలికలు ఆవులను మేపేందుకు గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లారు.సరదగా ఈత కొట్టి స్నానం చేసేందుకు ముగ్గురు బాలికలు చెరువులోకి దిగారు. చెరువులో బంక మట్టి పేరుకుపోవడంతో బాలికల కాళ్లు బురదలో చిక్కుకున్నాయి. ఒకరిని ఒకరు కాపాడేందుకు ప్రయత్నించి ముగ్గురూ బరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం లో ఆ మార్గంలో వెళుతున్న గ్రామస్తులకు బాలికల దుస్తులు కనపించాయి. వారు అక్కడ కనిపించ లేదు. అనుమానం వచ్చి వారు చెరువు వద్దకు వచ్చి పరిశీలించారు. అక్కడ బంకమట్టిలో బాలికల మృతదేహాలు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు తెలిపారు. వారు చెరువుకట్ట వద్దకు వచ్చారు. పిల్లల మృతదేహాల చూసి విలపించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement