దొంగ టీచర్ అరెస్ట్
Published Sat, Sep 21 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: అతనో బడిపంతులు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సంస్కర్త. అయితే వాటన్నింటినీ తుంగలో తొక్కి దొంగతనమే లక్ష్యంగా ఎంచుకుని కటకటాల పాలయ్యాడు. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల రాత్రి సమయాల్లో మహిళలు, ఒంటరిగా పయనిస్తున్న వారి వద్ద బంగారు నగలు చోరీ చేయడం శ్రుతిమించింది. తమ ఆస్తులు పోగొట్టుకుని పోలీసులను ఆశ్ర యిస్తున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీనిపై ఎస్పీ విజయకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలచెందర్ ఆధ్వర్యంలో చిన్నకాంచీపురం ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక పోలీసు బృందం నిఘా వేసింది.
శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేసింది. ఆ మార్గంలో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపి పరిశీలించారు. సదురు వ్యక్తి సక్రమంగా సమాధానం చెప్పక పోవడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వేలూరు జిల్లా పేర్నాంబట్టుకు చెందిన మధన్‌మారన్(34) అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వరుస చోరీలకు పాల్పడి సస్పెండ్‌కు గురైనట్టు తేలింది. అంతటితో ఆగక కాంచీపురంలో ఆరు నెలలుగా ద్విచక్ర వాహనంలో హెల్మెట్ ధరించి ఒంటరిగా వెళుతున్న మహిళల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసుకెళ్లడం అలవాటు చేసుకున్నాడు.
ఈ దొంగ టీచర్ వద్ద నుంచి 75 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల్లో పయనిస్తూ చోరీలకు పాల్పడ్డ కాంచీపురానికి చెందిన శివ(24),అబ్దుల్హ్రీమ్(24), కుమార్ తదితరుల వద్ద నుంచి రూ.27 లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించిన పోలీసులను ఎస్పీ విజయకుమార్ అభినందించారు.
Advertisement