తళి బరిలో స్వతంత్ర అభ్యర్థి
డెంకణీకోట: 30 ఏళ్లుగా తళి నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదు. తళి ప్రాంతంలో కళాశాలలేదు. వైద్యసదుపాయం అంతంత మాత్రం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు సరిగ్గాలేవు. గుల్లట్టి, వరదేగౌడరదొడ్డి, కొడగరై తదితర గ్రామాల ప్రజలకు బస్సు వసతులు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని తళి నియోజకవర్గంలో కర్మాగారాలు స్థాపించాలని, తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్లుగా ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకోలేదు. వెనుకబడిన తళి ప్రాంతం అభివృద్దికి కృషి చేస్తానని తళి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి తెలిపారు. ఆదివారం గెండగానపల్లిలో తన మద్దతుదారులతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. తనకు ప్రజలు ఓటు వేసి ఆదరించాలని కోరారు. నియోజకవర్గంలో పర్యటించానని ప్రజలు తనను పోటీ చేయవలసిందిగా కోరడంతో ఈ నిర్ణయం తీసుకొన్నానని తెలిపారు.
నియోజకవర్గంలో చిరంజీవి, మెగాకుటుంబం అభిమానుల మద్దతుతో తన కార్యాచరణ రూపొందించామని హరి తెలిపారు. డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో 300 మందికిపైగా మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో డీఎండీకే కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొనలేదు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు కెలమంగలం, డెంకణీకోట, తళి, బెణ్ణంగూరు, జెక్కేరి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిరంజీవి అభిమానులు కే.కేశవమూర్తి, శ్రీనివాసన్, వేణుగోపాల్, సంపంగిరామయ్య, వెంకటేశ్, మునిరాజు, మాదేవప్ప తదితరులు పాల్గొన్నారు.
తెలుగు నటుల ఫ్యాన్స్‌హవా!
హొసూరు: తెలుగు చలన చిత్ర నటుల అభిమానులు వారి సంఘాల ఆధ్వర్యంలో తళి రాజకీయం చక్రం తిప్పుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు తళిలో స్వతంత్ర అభ్యర్థిని నిలిపారు. డీఎండీకే పార్టీ జిల్లా కార్మిక శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న హరి తళి నియోజకవర్గంలో డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించారు. డీఎండీకే కూటమిలో తళి నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించడంతో టికెట్ ఆశించిన హరి మనస్తాపం చెందారు. చిరంజీవి, మెగాఫ్యామిలి అభిమాన సంఘాలు హరి అసంతృప్తిని రాజేసి స్వతంత్ర అభ్యర్థిగా తళి నియోజకవర్గంలో బరిలో దించారు. ఆదివారం హరి ఏర్పాటు చేసిన మద్దతుదారుల సమావేశంలో 400 మంది పాల్గొన్నారు. వీరిలో 300 మంది చిరంజీవి మెగాఫ్యామిలీ అభిమాన సంఘాల సభ్యులే.
చిరంజీవి అభిమానులకు ప్రత్యేకంగా అంటూ వక్తలు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కటే కేరింతలు. సభలో చిరంజీవి సినిమా డైలాగులే. ఒక్కొక్క అభిమాని, ముగ్గురిని ఆ ముగ్గురు మరో ముగ్గురిని తయారు చేసి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయించాలని హర్షధ్వానాల మద్య ఫ్రకటించారు. వేదికపై చిరంజీవి, ఆయన ఫ్యామిలీ నటుల ఫొటోలు వేసుకొన్నారు. సినీ అభిమాన సంఘాలతో తళిలో రాజకీయ ప్రభావం వేడెక్కుతుందా అని ఇక్కడి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.