
మృత్యు ఘోష
రాష్ర్టంలో మంగళవారం మృత్యువు విలయతాండవం చేసింది. రెండు ప్రమాదాల్లో 12మంది మృత్యువాత పడ్డారు. ధర్మపురి జిల్లా హొగెనేకల్ సమీపంలో ప్రభుత్వ బస్సు బోల్తాపడి 8 మంది మృతి చెందారు. పాడి వంతెన సమీపంలోని సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారులపైకి ఒక లారీ అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
హొసూరు :తమిళనాడులోని ధర్మపురి జిల్లా హొగేనకల్ పర్యాటక ప్రాంతంలోని అటవీ ప్రాంతం లోయలో ప్రభుత్వ ఆర్టీసీ పడింది. మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పది మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 42మంది గాయపడ్డారు. బస్సు తునాతునకలైంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో అరణ్యం హొరెత్తింది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లా బొమ్మడి నుంచి హొగేనకల్ మీదుగా క్రిష్ణగిరి జిల్లా అంచెట్టికి 60 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 11.45 గంటలకు తమిళనాడు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పెన్నాగరం దాటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మలుపులో వేగంగా ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి కుడివైపున ఉన్న రక్షణగోడను దాటుకుని వంద అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.
ఘటనలో బస్సు తునాతునకలైంది. ప్రయాణికులు కాళియప్ప(54), ఇతని భార్య వెంకటమ్మ (50), మాదమ్మ (50), మాదమ్మ మనుమరాలు శివశంకరి(10), సహాదేవ (50), మణివణ్ణన్, సుధాకర్(క్రిష్ణగిరి అగ్నిమాపక శాఖ ఉద్యోగి), ఓ చిన్నారి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెన్నాగరం, హొగేనకల్ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రెండు గంటలకు పైగా శ్రమించి క్షతగాత్రులను వెలికి తీసి పది 108 అంబులెన్‌సల ద్వారా పెన్నాగరం, ధర్మపురి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. డ్రైవర్ శివకుమార్‌తో పాటు ప్రయాణికులు కాళియప్ప, శివకుమార్, మహేశ్వరి, ఈశ్వరి, పెరియస్వామి మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని ధర్మపురి జిల్లా కలెక్టర్ వివేకానంద, డీఆర్వో శంకర్ ఎస్పీ, పోలీస్ అధికారులు పరిశీలించారు. ఘటనపై విచారణ జరపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.