అమ్మ క్యాంటీన్ల నిర్వహణ అధికారులకు భారంగా మారుతోంది. ఈ క్యాంటీన్లతో పెరిగిన పని భారాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛంద సంస్థల గుప్పెట్లోకి అమ్మ క్యాంటీన్లను తీసుకెళ్లే యోచనలో పడ్డారు. ఇందుకు తగ్గ పరిశీలన పర్వం ప్రారంభమైంది. త్వరలో నిర్ణయం వెలువడే అవ కాశాలు ఉన్నాయి.
సాక్షి, చెన్నై : పేదలకు ఆ క్యాంటీన్ ఓ వరం. కారు చౌక కే అక్కడ లభిస్తున్న అల్పాహారంతో కడుపు నిండుతోంది. రుచి, సుచికరంగా తమకు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, లెమన్ రైస్, చపాతీ తదితర పదార్థాలు లభిస్తుండడంతో అందరూ ఆ క్యాంటీన్ల బాట పడుతున్నారు. ‘అమ్మ’ చల్లంగా ఉండాలని దీవిస్తున్నారు. ఇది ప్రజాదరణ పొందుతూ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత(అమ్మ) పేరుతో కొలువు దీరిన ఈ క్యాంటీన్లు. తొలుత చెన్నైలోనూ, తదనంతరం దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లకు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణల్లోనూ ఈ క్యాంటీన్ల కొలువు దీరుతూ వస్తున్నాయి. ఈ క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ నుంచి వడ్డింపు వరకు అన్ని బాధ్యతల్ని మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. ఆయా క్యాంటీన్లకు ఆయా ప్రాంత కార్పొరేషన్ల పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని రకాల వస్తువుల్ని సరఫరా చేయడం జరుగుతూ వస్తున్నది. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సైతం వస్తున్నది. అయితే, నిర్వహణ బాధ్యత అధికారులకు భారంగా మారుతున్నది.
భారంగా ‘అమ్మ’ : రాజధాని నగరం చెన్నైలో 250 వరకు , ఇతర కార్పొరేషన్లలో తలా పదిహేను , ఇరవైకు పైగా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో, ప్రధాన ఆసుపత్రుల్లోనూ కొలువు దీర్చి ఉన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కార్పొరేషన్ అధికారులకే అప్పగించి ఉన్నారు. కార్పొరేషన్‌లలోని సంబంధిత విభాగాల్లో తమ విధులతో పాటుగా, ఈ క్యాంటీన్లు తమకు అదనపు భారంగా మారడంతో అధికారులు, సిబ్బందికి పని భారం తప్పడం లేదు. అదనపు బాధ్యతలతో కార్పొరేషన్లలో తాము చేయాల్సిన విధులకు ఆటంకం కల్గుతుండడంతో, తాము చేస్తున్న పర్యవేక్షణ, నిర్వహణా పనుల్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.
స్వచ్ఛంద గుప్పెట్లోకి : అమ్మ క్యాంటీన్లకు లభిస్తున్న ఆదరణ, ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. ఆయా రాష్ట్రాలు అమ్మ క్యాంటీన్లను ఆదర్శంగా చేసుకుని, తమ రాష్ట్రాల్లోనూ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పని భారంతో ఈ క్యాంటీన్లను స్వచ్చంద సంస్థల గుప్పెట్లోకి తీసుకెళ్లే యోచనలో అధికార యంత్రాంగం ఉన్నది. ఇందుకు తగ్గ పరిశీలన ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టి ఉన్నారు. రాష్ట్రంలోని పదివేల పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంతో పాటుగా అమ్మ క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణను స్వచ్చంద సంస్థలకు అప్పగించే విధంగా ఈ పరిశీలన సాగుతున్నది.
కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం స్వచ్చంద సంస్థల ద్వారా సాగుతున్న దృష్ట్యా, వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ఉన్నది. ఈ పరిశీలన ప్రక్రియతో స్వచ్చంద సంస్థల ద్వారా అమ్మ క్యాంటీన్లలో మరింత నాణ్యతతో కూడిన పదార్థాలను అందించే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. లాభాపేక్షతో కాకుండా, ప్రజా సేవ లక్ష్యంగా పనిచేసే స్వచ్చంద సంస్థలకు మాత్రమే ఈ క్యాంటీన్లను అప్పగించే విధంగా కసరత్తులు సాగుతున్నాయి. త్వరలో తుది నిర్ణయం తీసుకుని, ఆమోదం కోసం సీఎం దృష్టికి నివేదికను అధికారులు తీసుకెళ్లబోతున్నారు. అయితే, తన పేరిట పేదల కడుపు నింపుతున్న అమ్మ క్యాంటీన్లను, ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వచ్చంద గుప్పెట్లోకి అప్పగించేందుకు సీఎం జయలలిత ఏ మేరకు అంగీకరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.
భారంగా అమ్మ
Published Mon, Sep 7 2015 2:34 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM
Advertisement
Advertisement