కేసుల సత్వర పరిష్కారం నిమిత్తం కొత్తగా రాష్ట్రంలో కోర్టుల ఏర్పాటుకు సీఎం జయలలిత
గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగపెరుమాల్ కోవిల్ - ఒరగడం, వండలూరు - ఒరగడం రోడ్లను
సిక్స్‌లేన్లుగా మార్చేందుకు నిధుల్ని కేటాయించారు. ఆర్టీఏ కార్యాలయాల స్థాయిని పెంచుతూ
ఆదేశాలు ఇచ్చారు. త్వరలో 1144 ప్రొఫెసర్‌ల పోస్టుల భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.
సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం 110 నిబంధనల మేరకు పలు ప్రత్యేక ప్రకటనలను సీఎం జయలలిత చేశారు. ఆ మేరకు రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో రూ. 134 కోట్ల ఖర్చుతో 170 కోర్టులను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని సత్వర పరిష్కారం లక్ష్యంగా మరో 22 కోర్టుల్ని ఈ ఏడాది ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. లాల్గుడి, కీరనూర్, ఓమలూరు, పరమత్తి , ఆండి పట్టి, మదురైలో మూడు, కోయంబత్తూరులో రెండు, మనప్పార్, అరుప్పుకోట్టై, తిరుమంగళంలలో 13 జిల్లా కోర్టులను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అలాగే, వాడి పట్టి, ఓమలూరు, కుంబకోణం, తాంబరం, ఆలందూరుల్లో తొమ్మిది అనుబంధ కోర్టులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మహిళలపై సాగుతున్న నేరాల విచారణ లక్ష్యంగా 22 మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఇటీవల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ ఏడాది కన్యాకుమారి, నాగపట్నం, ఆరణి, మెట్టూరు, కుంబకోణం, పళని,విల్లుపురం , కంచి తదితర పది చోట్ల రూ. ఐదు కోట్లతో ఫాస్ట్ ట్రాక్ మహిళ కోర్టులను ఏర్పాటు చేయనున్నామని వివరించారు.
321 కోట్లతో : ముల్లై పెరియార్, తదితర జలాశయాల నుంచి విడుదల అయ్యే ఉబరి నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు గాను రూ. 321 కోట్లు వెచ్చించనున్నామని వివరించారు. ఆయా జలాశయాల పరిసరాల్లోని ప్రాంతాలను అనుసంధానించే విధంగా నీటి కాలువల ఏర్పాటుతో పాటుగా, 105 చెరువుల్ని పునరుద్దరించనున్నామని పేర్కొన్నారు.
సిక్స్ లేన్ : సింగపెరుమాల్ కోవిల్ - ఒరగడం, వండలూరు - ఒరగడం మార్గాలను సిక్స్ వేలుగా తీర్చిదిద్దనున్నామని ప్రకటించారు. పారిశ్రామికంగా ఒరగడం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని వివరించారు. జాతీయ రహదారిని కలుపుతూ ఈ సిక్స్‌లేన్ల నిర్మాణం సాగుతుందని ప్రకటించారు. వండలూరు - ఒరగడం మార్గంలోని పడప్పై గ్రామంలో అవుటర్ రోడ్డు, భారీ వంతెన నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. ఇందుకు గాను రూ. 200 కోట్లను వెచ్చించనున్నామన్నారు. తండయార్ పేట - ఆర్‌కే నగర్ మధ్యలో ఉన్న బకింగ్ హాం కాలువపై రూ. ఐదు కోట్లతో భారీ వంతెన నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రం లోని ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1144 ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. శ్రీ పెరంబదూరు, పళని, మె ట్టూరు, శివకాశి ఆర్‌టీవో కార్యాలయాల స్థాయిని పెంచనున్నామని ప్రకటించారు.
కొత్త కోర్టులు
Published Sat, Sep 26 2015 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement