సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే మద్య నిషేధంపై తప్పని సరిగా నిర్ణయం తీసుకుని తీరుతామని డీఎంకే మహిళా మహానాడు స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. 2016లో డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. సమిష్టిగా కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు.
డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన అధినేత కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి తన దైన శైలిలో దూసుకెళ్తున్నారు. మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్న కనిమొళి, తన నేతృత్వంలో భారీ మహానాడును నిర్వహించి తన సత్తాను చాటుకునే యత్నం చేశారు. మద్యం వ్యతిరేక మహిళా మహానాడుగా కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని కరశంగాళ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జన సందోహం తరలి వచ్చింది.
ఈ మహానాడుకు హాజరైన డీఎంకే అధినేత ఎంకరుణానిధి, ఎంకే స్టాలిన్‌లకు ఆ పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఈ మహానాడు వేదికగా ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ , 2016లో డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అధినేత ఎం కరుణానిధి సీఎం పగ్గాలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరుణానిధి తన ప్రసంగంలో మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ వ్యాఖ్యలు చేశారు. సమిష్టిగా, ఐక్యతతో నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపు నిచ్చారు. ముందుగా ఈ మహానాడు ద్వారా కొన్ని తీర్మాణాలు చేశారు.
డీఎంకే అధికారంలోకి రాగానే మద్య నిషేధం లక్ష్యంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లోనైనా రాష్ట్రప్రభుత్వం మద్య నిషేధంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాం డ్ చేశారు. మద్య నిషేధంపై ప్రకటన తప్పని సరిగా చేయాల్సిందేనని పట్టుబట్టారు. మద్యంకు వ్యతిరేకంగా సాగిన నిరసనల్లో అరెస్టు చేసిన వారందర్నీ విడుదల చేయాలని, కేసులన్నీ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
మద్య నిషేధం తప్పనిసరి
Published Sun, Aug 23 2015 3:21 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
Advertisement
Advertisement