తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తుందా, పాత ప్రభుత్వానికే మరోసారి అవకాశం దొరుకుందా...అనే ప్రశ్న ప్రజల బుర్రలను తొలిచేస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకే అధికారమా లేక డీఎంకే అధ్యక్షులు కరుణానిధికే సీఎం పీఠమా అని రెండు పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపే నేతలు, ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు కారణం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ప్రజలు, నేతలకు ఈనెల 16వ తేదీ నాటి పోలింగ్‌తో ఆ ముచ్చట తీరింది. ఈనెల 19వ తేదీన ఓట్ల లెక్కింపు ముగిసి ఫలితాలు ఎలా ఉండబోతాయోనని కార్పొరేట్ కార్యాలయాల నుంచి టీకొట్టు, కిళ్లీ బంకు వరకు చర్చసాగుతోంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకుగాను తంజావూరు, అరవకురిచ్చి వాయిదాపడడంతో 232 స్థానాల్లో విజేతలు ఎవరు, పరాజితులు ఎవ్వరో గురువారం సాయంత్రానికి తేలిపోనుంది.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తారు. రాష్ట్రం మొత్తం మీద 68, చెన్నైలో మూడు లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కుండపోతగా వర్షం పడుతున్నందున అదనపు ఏర్పాట్లు అవసరమైంది. గెలుపునకు ఓటమికి ఓట్ల తేడా స్వల్పంగా ఉన్న పక్షంలో రెండోసారి లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ ప్రకటించారు. ఓట్ల లెక్కింపు కారణంగా టాస్మాక్ దుకాణాలను గురువారం మూసివేయనున్నారు.
ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్:
తిరుప్పూరులో మూడు కంటైనర్లలో రూ.570 కోట్లు స్వాధీనం చేసుకోవడం, ఆ సొమ్ము స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియాదని చెప్పడంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. రిజర్వుబ్యాంకు, ఇంటెలిజెన్స్ అధికారులచే విచారణ జరిపి నివేదిక వచ్చే వరకు ఓట్ల లెక్కింపు వాయిదావేయాల్సిందిగా తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నాడు.
పుదుచ్చేరీలో ఐదు చోట్ల లెక్కింపు:
పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు సైతం గురువారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభించనున్నారు. మొత్తం ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు.
తీర్పు నేడే!
Published Thu, May 19 2016 3:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement