లంకకు జాలరన్న!
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం భారత్ ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్లను విడుదల చేసిన లంక సేనలు పడవల్ని మాత్రం తమ గుప్పెట్లోనే పెట్టుకున్నాయి. శ్రీలంక ఆధీనంలో తమిళులకు చెందిన 92 పడవలు ఉన్నాయి. తమ పడవల్ని తిరిగి ఇవ్వాలని వేడుకుంటూ వస్తున్నా ఫలితం శూన్యం. ఈ నేపథ్యం లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనతో సిరిసేన నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెట్టు దిగింది. తమిళ జాలర్ల వ్యవహారంపై చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కసరత్తుల్ని వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని తమ గుప్పెట్లో ఉన్న 81 పడవల్ని మాత్రం విడుదల చేయడానికి శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ప్రకటించారు. ఆ మేరకు ఆ పడవల్ని విడుదల చేసే రీతిలో అక్కడి కోర్టులు ఆదేశాలు జారీ చేసింది. తమ పడవల్ని విడుదల చేయడానికి శ్రీలంక సర్కారు అంగీకరించడంతో ఆ దేశానికి పయనమయ్యే పనిలో రాష్ట్ర జాలర్లు నిమగ్నం అయ్యారు.
81 పడవల్ని విడుదల చేసినా మిగిలిన 11 పడవల్ని కూడా ఇక్కడకు తెప్పించుకునే రీతిలో అధికారులు కసరత్తుల్లో పడ్డారు. ఆయా పడవల యజమానులతోసంప్రదింపుల అనంతరం 150 మందిని లంక పయనానికి ఎంపిక చేశారు. కొన్ని నెలలుగా పడవలు ఆ దేశ ఒడ్డుకు పరిమితమై ఉన్న దృష్ట్యా, అవి ఏ మేరకు మరమ్మతులకు గురై ఉన్నాయోనన్న ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర మత్స్య శాఖ అధికారుల నేతృత్వంలో మొత్తంగా 150 మంది అర్ధరాత్రి లేదా, సోమవారం వేకువ జామున లంకకు పయనం కానున్నారు. నాగపట్నం, పుదుకోట్టై,రామనాథపురం, కారైక్కాల్ జాలర్లు ఈ బృందంలో ఉన్నారు. వీరందర్నీ పది బోట్లలో గట్టి భద్రత నడుమ శ్రీలంక సరిహద్దుల్లోకి తీసుకెళ్లేందుకు భారత కోస్ట్ గార్డ్ చర్యలు చేపట్టింది. సముద్రంలో వీరికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, హెలికాప్టర్, తమ పడవలతో గస్తీకి చర్యలు తీసుకున్నారు. సముద్ర సరిహద్దుల్లో వీరందర్నీ భద్రంగా శ్రీలంక నావికాదళం, ఉన్నతాధికారులకు అప్పగించనున్నారు. తమ పడవల్ని స్వాధీనం చేసుకుని రెండు మూడు రోజుల్లో వీరంతా తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది.