తమిళనాడు న్యాయవాదుల సంఘానికి బార్ కౌన్సిల్ అనుమతి కల్పించడం వివాదానికి దారి తీసింది. అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిరసన బాట పట్టింది. బార్ కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా విధులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు. న్యాయవాదుల మధ్య విభేదాలు సృష్టించి చీలికకు దారి తీసేలా బార్ కౌన్సిల్ వ్యవహరిస్తోందని నిరసనకారులు విమర్శించారు.
సాక్షి, చెన్నై: హైకోర్టు న్యాయవాదుల సంఘంలో గతంలో పని చేసిన న్యాయవాది ఎస్ ప్రభాకరన్ కొత్తగా తమిళనాడు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేశారు. తమ కార్యక్రమాల్ని విస్తృత పరుస్తూనే, బార్ కౌన్సిల్ అనుమతికి యత్నించారు. గతంలో అనుమతుల కోసం ప్రభాకరన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చెన్నై హైకోర్టు న్యాయవాదుల సంఘం వ్యతిరేకతతోనే అనుమతి వ్యవహారం ఆగింది. ఈ పరిస్థితుల్లో ఈ నెల ఎనిమిదో తేదీన తమిళనాడు న్యాయవాదుల సంఘానికి బార్ కౌన్సిల్ అనుమతి లభించడం, చెన్నై హైకోర్టు న్యాయవాదుల సంఘాన్ని విస్మయంలో పడేసింది. న్యాయవాదుల్లో చీలిక లక్ష్యంగా కుట్ర జరుగుతోందని, అందుకే హైకోర్టు ఆవరణలో మరో సంఘాన్ని ప్రోత్సహించే పనిలో బార్ కౌన్సిల్ ఉందంటూ వివాదం బయలు దేరింది.
విధుల బహిష్కరణ : హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆర్‌సి పాల్ కనకరాజ్ నేతృత్వంలో కమిటీ సమావేశం అయింది. బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పాల్ కనక రాజ్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు మోహన కృష్ణన్, న్యాయవాద సంఘం నాయకులు అరివలగన్, ఇమాన్యుయేల్ నేతృత్వంలో హైకోర్టు న్యాయవాదులు బుధవారం ఆవిన్ గేట్ వద్ద నిరసనకు దిగారు. హైకోర్టు ఆవరణలోని అన్ని బెంచ్‌ల వద్దకు వెళ్లి బయట నుంచి నినాదాలతో హోరెత్తించారు. సహచర న్యాయవాదుల్ని విధులు బహిష్కరించాలంటూ పిలుపు నిచ్చి నిరసన కొనసాగించే పనిలో పడ్డారు. న్యాయవాదుల విధుల బహిష్కరణతో విచారణకు ఆటంకాలు తప్పలేదు. నిరసనను ఉద్దేశించి పాల్ కనక రాజ్ మాట్లాడుతూ, హైకోర్టులోని న్యాయవాదుల్లో చీలిక లక్ష్యంగా భారీ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. గతంలో తాము వ్యతిరేకించి అనుమతి రద్దు చేయించామని, అయితే, చాప కింద నీరులా ప్రస్తుతం అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. బార్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
అనుమతి చిచ్చు
Published Thu, Mar 12 2015 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement