చెన్నై, సాక్షి ప్రతినిధి: మక్కాహజ్‌కు తమిళనాడు నుంచి తరలి వెళ్లిన తమిళులంతా క్షేమంగా ఉన్నారని హజ్ కమిటీ ప్రకటించింది. అయితే కోయంబత్తూరుకు చెందిన ఒక మహిళ మృతి చెందినట్లు సమాచారం అందింది. సౌదీ అరేబియాలో మక్కా మసీదుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు వెళుతుంటారు. భారత్ నుంచి సైతం పెద్ద సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా మసీదును విస్తరించే పనులను చేపడుతున్న తరుణంలో భారీ క్రేన్ దానిపై పడడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 107 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడు నుంచి 3,415 మంది మక్కాకు చేరుకున్నారు.
వారంతా క్షేమంగా ఉన్నారని, సురక్షితమైన ప్రదేశంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారని హజ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 24వ తేదీన తమిళనాడు నుంచి మరో బృందం మక్కాకు చేరుకోనుంది.కోవై మహిళ మృతి: ఇదిలా ఉండగా, కోయంబత్తూరుకు చెందిన మహ్మమద్ ఇస్మాయిల్ భార్య బీమాభాను (24) మృతి చెందారు. వివాహం అయిన తరువాత దంపతులిద్దరూ కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపం కల్‌మండపంలో కాపురం పెట్టారు. పవిత్ర మక్కా మసీదులో ప్రార్థనలు చేయాలన్న తలంపుతో ఇరువురూ ఇటీవలే సౌదీ అరేబియాకు వెళ్లారు. మసీదుపై భారీ క్రేన్ కూలినపుడు దానికింద చిక్కుకుని బీమా భాను కూడా ప్రాణాలు కోల్పోయారు.
తమిళులు క్షేమం
Published Sun, Sep 13 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement
Advertisement