
మళ్లీ దక్కేనా?
చెన్నై : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మళ్లీ దక్కించుకునేందుకు తమిళిసై ప్రయత్నాల్లో పడ్డారు. ఆ పదవిని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు కమలనాథులు సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజా కుస్తీలు పడుతున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు ఎవర్ని ఆ పదవికి ఎంపిక చేస్తారోనన్నది బుధవారం తేలబోతోంది. దీంతో పదవీ ఆశలో పడ్డ నాయకులు ఢిల్లీకి మంగళవారం పరుగులు తీశారు.
బీజేపీలో ఒకరికి ఒకే పదవి అన్న విషయం తెలిసిందే. ఆ మేరకు గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా ఎంపీగా గెలిచిన పొన్ రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోక తప్పలేదు. ఆ సమయంలో ఆ పదవి కోసం కమలనాథులు పెద్ద సంఖ్యలోనే పోటీ పడ్డారు.
అయితే, పార్టీ కోసం అహర్నిషలు శ్రమిస్తూ, ఏళ్ల తరబడి బీజేపీని నమ్ముకుని పయనం సాగించిన తమిళి సై సౌందరరాజన్‌కు అవకాశం దక్కింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమెకు అధ్యక్ష పగ్గాలు కేటాయించిన, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అందుకు తగ్గ అధికారాలు అప్పగించారు.
దీంతో రాష్ర్టంలో కమలం బలపడేందుకు తీవ్రంగానే తమిళి సై కృషి చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ, పార్టీ వర్గాల్ని కలుపుకుని ముందుకు సాగారు. ఆ పదవి చేపట్టి ఏడాది అవుతున్న దృష్ట్యా, సంస్థాగత ఎన్నికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ, కొత్త అధ్యక్ష ఎంపిక మీద దృష్టి సారించాల్సి ఉంది. అయితే, వర్షాలు ముంచెత్తడంతో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ఎంపిక మీద జాతీయ పెద్దలు దృష్టి పెట్టారు. దీంతో మరో మారు పదవిని చేజిక్కించుకునేందుకు తమిళి సై ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు.
తనకే మళ్లీ దక్కుతుందన్న ఆశాభావంలో ఉన్నా, ఆమెకు కాకుండా తమకంటే, తమకు అప్పగించాలని కమలనాథులు సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజాఢిల్లీ పెద్దల ముందు వాదన ఉంచినట్టు సమాచారం. రానున్నది ఎన్నికల కాలం కావడంతో అందుకు తగ్గ వ్యూహా రచన, అమలు బాధ్యతలకు తగ్గ నేత నియామకాలకు అధిష్టానం కసరత్తులు చేపట్టి ఉండటంతో పదవీ ఆశల్లో ఉన్న నాయకులు రెడీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షా నేతృత్వంలో జరగనున్న సమావేశంలో కొత్త అధ్యక్ష నియామకం సాగబోతోంది. దీంతో పదవీ ఆశలో ఉన్న నాయకులు ఢిల్లీ బాట పట్టి ఉన్నారు.
ఇప్పటికే ఢిల్లీలో పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు తమిళి సై, పదవిని ఆశిస్తున్న సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజాలు ఢిల్లీ చేరారు. అలాగే, పార్టీ సీనియర్లు ఇల గణేషన్, లక్ష్మణన్ సైతం ఢిల్లీకి వెళ్లి ఉండడంతో అధ్యక్షులు ఎవరు అన్నది మరి కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉంది. అయితే, మెజారిటీ శాతం మంది మాత్రం తమిళి సైకు మళ్లీ చాన్స్ దక్క వచ్చని పేర్కొంటుండగా, మార్పు జరిగినా జరగవచ్చంటూ మరి కొందరు పేర్కొంటున్నారు.