రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10% డీఏ పెంపు: జయలలిత
Published Fri, Oct 11 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల కానుకను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పది శాతం పెంచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పెంపు 18 లక్షల మందికి జూలై నెల నుంచి వర్తిస్తుంది. దీంతో ఉద్యోగులకు రూ.వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకు జీతాలు పెరగనున్నాయి. తద్వారా రాష్ర్ట ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,292 కోట్ల 78 లక్షల అదనపు భారం పడుతుంది.
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, ప్రత్యేక పథకాల అమలులో నిమగ్నమైన సిబ్బంది సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి జయలలిత తరచూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగడంతో తమకూ పెరుగుతుందన్న ఆశ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొంది. ఉచిత పథకాలు, ప్రత్యేక పథకాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఇప్పటికే భారం పడింది. అయినప్పటికీ తమకు డీఏ పెరిగేనా అన్న సందిగ్ధత వారిలో బయలుదేరింది. వారి ఆశల్ని అడియాశలు చేయకుండా దసరా, దీపావళి కానుకగా డీఏను పెంచుతూ ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏను పెంచుతున్నామని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కేంద్రం డీఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పథకాలు సక్రమంగా అమ లు చేయడంలో ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం, ప్రజల కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు డీఏను పది శాతం పెంచుతున్నామని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు, కుటుంబ పెన్షన్‌దారులకు, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్థానిక సంస్థలు, అంగన్‌వాడీ, గ్రామ అసిస్టెంట్లు, పౌష్టికాహార పథకం తదితర విధుల్లో ఉన్న 18 లక్షల మంది ఉద్యోగులకు ఈ డీఏ పెంపు వర్తిస్తుందని వివరించారు. ఈ ఏడాది జూలై నుంచి పెంపు వర్తింపజేస్తున్నామని వివరించారు. దీంతో ఉద్యోగులకు రూ.వెయ్యి నుంచి ఐదు వేల వరకు వేతనాలు పెరగనున్నాయి. ఏడాదికి రాష్ర్ట ప్రభుత్వంపై రూ.2292 కోట్ల 78 లక్షలు అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు డీఏ పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పండుగ కానుకగా ఈ పెంపును ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement