కలబుర్గికి కన్నీటి వీడ్కోలు
కన్నీటి పర్యంతమైన అభిమానులు
ధారవాడ(సాక్షి, బళ్లారి) : కర్ణాటక సాహితీ దిగ్గజాల్లో ప్రముఖుడు, పరిశోధకుడు డాక్టర్ మహేశప్ప మడివాళప్ప కలబుర్గికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కలబుర్గి పార్థివ శరీరాన్ని ధారవాడ నగరంలోని కర్ణాటక విశ్వవిద్యాలయ రుద్రభూమిలో కలబుర్గి సమాజం ఆచార, పద్ధతి ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. కలబుర్గికి కడసారి దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం ఉదయం ప్రముఖ వాణిజ్య నగరమైన ధారవాడలోని కళ్యాణనగర్‌లో ఆయన నివాస గృహం వద్దనే దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పిస్తోల్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విశేష అభిమానులను కూడగట్టుకున్న కలబుర్గి హత్య యావత్ కర్ణాటక రాష్ట్ర ప్రజలను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. బళ్లారి జిల్లా హంపి కన్నడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కూడా ఆయన కొంత కాలం పని చేశారు.
సుదీర్ఘ కాలం అధ్యాపకునిగా, ఇతర పదవులను అలంకరించి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా సాహితీ, పరిశోధన రంగాలకు ఆయన చేసిన సేవలు అపారం. సాహిత్య రంగంలో ఆణిముత్యంగా వెలిగిన కలబుర్గి హత్య కావడంతో ఆయన పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి రెండు రోజులుగా ధారవాడ జనసాగరంగా మారింది. సోమవారం ఉదయం ధారవాడ నగరంలోని విశ్వవిద్యాలయం రుద్రభూమిలో కలబుర్గి పార్థివ శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కలబుర్గి పార్థివ శరీరాన్ని కడసారి వీక్షించేందుకు ప్రముఖ రాజకీయ నేతలు, పలువురు మఠాధీశులతో పాటు విద్యార్థి లోకం తరలివచ్చింది. ఈసందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కలబుర్గిని హత్య చేయడం దారుణమని పలువురు ప్రముఖులు బాధతప్త హృదయాలతో పేర్కొన్నారు. ఒక మంచి వ్యక్తిని, సమాజం కోసం నిరంతరం పరితపించే మహానుభావుడిని దుండుగులు పొట్టన బెట్టుకోవడం ఖండనీయమని, వెంటనే పట్టుకుని కఠిన ంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.