సాక్షి, ముంబై: పాదచారుల భద్రత దృష్ట్యా సైన్-పన్వేల్ హైవేపై కొత్తగా పది ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ 23 కిలోమీటర్ల బ్రిడ్జిపై ప్రజాపనుల విభాగం ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు కీలకమైన 10 స్థలాలను గుర్తించింది. అయితే సైన్-పన్వేల్ విస్తరణ ప్రాజెక్టు (రూ.1,220 కోట్లు)లో భాగంగా ఈ పనులను చేపట్టనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ పది ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను వాషిలోని వకార్డ్ ఆస్పత్రి, మాన్‌కుర్డ్ స్టేషన్, సాన్‌పాడాలోని పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలో, సీవుడ్-వాషీల మధ్య ఉన్న ఆక్ట్రాయ్ నాకా, సీబీడీ బేలాపూర్‌లోని భారతి విద్యాపీఠ్ సమీపంలో, ఖార్గర్ ఫ్లైఓవర్, కోపర్ విలేజ్, నలంబోలిలో ఉన్న మెక్‌డొనాల్డ్, డి.వై.పాటిల్ స్టేడియం వద్ద ఉన్న తుర్బే ఫ్లైఓవర్ వద్ద ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ అగవానే తెలిపారు. 2015 వరకు ఈ పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రతకు మొదటగా ప్రాముఖ్యత ఇస్తామన్నారు. ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకుపోవడంతో చాలా ప్రమాదాలు సంభవించి పాదాచారులు మృతి చెందుతున్నారు. అయితే ఈ బ్రిడ్జిలను నిర్మించిన తర్వాత ఈ ప్రమాదాలను కొంతమేర అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సైన్-పన్వేల్ రోడ్డును ఆరు నుంచి 12 లేన్ల వరకు విస్తరించనున్నారు. ఎనిమిది ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటికే అనుమతి లభించిందని, మరో రెండు బ్రిడ్జిలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉంద’న్నారు. వచ్చే ఏడాదిలోపు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సైన్-పన్వేల్ హైవేపై పది ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు
Published Tue, Mar 11 2014 11:16 PM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM
Advertisement
Advertisement