ఉద్రిక్తతకు దారితీసిన కాంట్రాక్టర్ హత్య
Published Fri, Sep 27 2013 3:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరులో ఓ కాంట్రాక్టర్ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. అతడి మద్దతు దారులు, బంధువులు జీహెచ్ వద్ద వీరంగం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగారు. ఆ దృశ్యాల్ని చిత్రీకరించిన సాక్షి విలేకరి కే వెంకటేశ్వర్లుపై తమ ప్రతాపం చూపించారు. కెమెరా ధ్వంసం చేశారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంకు చెందిన మునుస్వామి కుమారుడు కమలనాథన్(42) రోడ్డు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బుధవారం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచిం చారు.
ఆయన చెన్నైకి వెళ్లకుండా ఇంటికి వెళ్లారు. ఈ పరిస్థితులో ప్రత్యర్థులు ఆయనపై దాడి చేసి కాళ్లు, చేతులపై నరికి దారుణంగా హత్య చేశారు. కమలనాథన్ మృతదేహాన్ని గురువారం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అక్కడికి చేరుకున్న అతడి మద్దతుదారులు, బంధువులు వీరంగం సృష్టించారు. ఆస్పత్రిలో ఉన్న కమలనాథన్ను ఎందుకు డిశ్చార్జ్ చేశారంటూ వైద్యులపై జులుం ప్రదర్శించారు. వివాదం ముదరడంతో వారి ఆగ్రహానికి జీహెచ్ గురికావాల్సి వచ్చింది.
పరుగులు తీసిన రోగులు
కమలనాథన్ మద్దతు దారుల వీరంగం సృష్టించడంతో ఆస్పత్రిలోని రోగులు భయాందోళనతో తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు. భయానక వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ కన్నన్, ఇన్స్పెక్టర్ హరికృష్ణన్, వెల్లవేడు ఎస్ఐ ఇరుడి కేశవన్, తాలూకా ఎస్ఐ అన్నాదురై అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కమలనాథన్ వర్గీయులు పోలీసులపై తిరగబడ్డారు. దొరికిన వారిని చితక బాదా రు. అక్కడే ఉండి ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి వెంకటేశ్వర్లు, మక్కల్ టీవీ విలేకరి గోపీని బంధించి దాడి చేశారు. వారి కెమెరాల్ని ధ్వంసం చేశారు. వెంకటేశ్వర్లుతో పాటు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి.
విలేకరుల ఆందోళన
తమ మీద దాడిని ఖండిస్తూ తిరువళ్లూరులోని విలేకరులు ఎస్పీ రుపేష్కుమార్ మీనా, ఏఎస్పీ సెంథిల్కుమార్ను కలుసుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని, కెమెరా రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు. తన మీద జరిగిన దాడి, కెమెరా ధ్వంసంపై సాక్షి విలేకరి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ వెంకటేశ్వర్లు, అలాగే ఎస్ఐలు కన్నన్, ఇరుడికేశవన్, అన్నాదురై, ఇన్స్పెక్టర్ హరికృష్ణన్ జీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో అన్నాదురై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను తిరువళ్లురులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement