రాహుల్ గాంధీ 'స్టార్ హోటల్'
చెన్నై తేనాంపేటలోని కాంగ్రెస్ మైదానంలో 7 స్టార్ హోటల్ నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అనుబంధంగా ఉన్న కాంగ్రెస్ ట్రస్ట్ సభ్యునిగా మోతీలాల్ ఓరాను నియమించినట్లు సమాచారం.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో 1967 తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను సేకరించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ది. ఆయన హయాంలోనే చెన్నై నగరానికి గుండెకాయవంటి తేనాంపేటలో 30 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. 1960లో కొనుగోలు చేసిన ఆ స్థలం విలువ నేడు రూ.5వేల కోట్లు పైమాటే. ఈ మైదానంలో అనేక దుకాణాలు, కామరాజర్ అరంగం తదితరాలు ఉన్నాయి. ఇదిగాక రాయపేటలో సత్యమూర్తి భవన్ కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ టీఎన్‌సీసీ ట్రస్ట్ పేరుతో ఉన్నాయి. ఈ ట్రస్ట్ పర్యవేక్షణకు పార్టీ అధిష్టానం నలుగురిని సభ్యులుగా నియమించడం ఆనవాయితీ. ట్రస్ట్ సభ్యులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, జయంతీ నటరాజన్ పార్టీకి రాజీనామా చేయగా, రాజాజీ మనవడు కేశవన్, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ ఓరాను పార్టీ ఇటీవలే నియమించింది.
తీవ్ర నిరసన
ఇప్పటి వరకు ట్రస్ట్ సభ్యులుగా రాష్టానికి చెందిన వారినే నియమిస్తూ రాగా, తొలిసారి ఉత్తరాదికి చెందిన ఓరాను నియమించడంపై పార్టీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కామరాజర్ చేత స్థాపించడం వల్ల ఈ ట్రస్ట్ స్వయంప్రతిపత్తితో సాగుతోంది. గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన పీ రామచంద్రన్ కారణంగా ఈ ట్రస్ట్ చేతులుమారి ఢిల్లీ కాంగ్రెస్‌కు చేరగా, తాజాగా ఉత్తరాదికి చెందిన మోతీలాల్ ఓరా సభ్యులుగా నియమితులు కావడంతో పార్టీలో గుసగుసలు బయలుదేరాయి. అంతేగాక సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉత్తరాది వ్యక్తిని ట్రస్ట్ సభ్యులుగా నియమించడంపై న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తేనాంపేటలోకి కాంగ్రెస్ మైదానంలో షాపింగ్‌మాల్, 7 నక్షత్రాల హోటల్‌ను నిర్మించే ఆలోచనతోనే మోతీలాల్ ఓరా నియామకం జరిగిందని పార్టీ వర్గాల ద్వారా వెల్లడైంది. నిర్మాణానికి సంబంధించి ముంబయికి చెందిన ఒక పారిశ్రామికవేత్తను రాహుల్‌గాంధీ సిద్ధం చేసినట్లు తెలిసింది. షాపింగ్ మాల్‌లోని మొదటి రెండు అంతస్తులను పార్టీకి కేటాయించాలని నిర్ణయించారు. ఈ పనులపైనే టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారని పార్టీ శ్రేణుల సమాచారం.