
మిస్టరీగానే సునంద హత్య కేసు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో మిస్టరీ వీడలేదు. సునంద మృతి కేసులో వేరే వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు తాను భావించడం లేదని, ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్లే మరణించిందని శశిథరూర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. శనివారం ఢిల్లీ పోలీసులు ఐదుగంటల పాటు ఆయన్ను విచారించారు.
సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు శశి థరూర్ ఇంట్లో పనిచేసేవారిని, సునంద డాక్టర్ను పలుమార్లు ప్రశ్నించారు. శశి థరూర్ను మరోసారి పిలిపించి విచారించారు. అయినా సునంద హత్య కేసు మిస్టరీకి ముగింపు పడలేదు.