పుదుచ్చేరి టు తమిళనాడు
► అధికారం కోసం అమిత్‌షా వ్యూహం
► ఢిల్లీకి సీఎం నారాయణ స్వామి
దక్షిణాదిలో వేళ్లూనుకుని అధికార పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమలనాథులు పుదుచ్చేరిని ప్రవేశద్వారంగా మలుచుకుంటున్నారు. సీఎం నారాయణస్వామి ప్రభుత్వం బీటలు వారేలా చేసి పగ్గాలు చేపట్టేందుకు చేస్తున ప్రయత్నాల కొనసాగింపుగా తమిళనాడులోకి ప్రవేశించాలని అమిత్ వ్యూహరచన చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొదట పుదుచ్చేరిలో, తర్వాత తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. గతంలో ఉత్తరాది బలంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా దక్షిణాదిలో గణనీయమైన మెజార్టీ రాలేదు.
ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికైనా దక్షిణాదిలో వేళ్లూనుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమిళనాడుపై కన్నేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీతో పూడ్చాలని ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. జయ మరణం తరువాత సీఎం పన్నీర్‌సెల్వంను చేరదీయడం ద్వారా మార్గం సుగమం అయిందని వారు ఆశించారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా పన్నీర్ మాజీగా మారిపోగా శశికళ వర్గానికి చెందిన ఎడపాడి సీఎం అయ్యారు.
అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటిగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణలో తమిళనాడు రాజకీయాలకు అనుబంధంగా ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం లడ్డులా దొరికింది. 33 మంది ఎమ్మెల్యేలు కలిగిన పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అలాగే ప్రతిపక్షంగా ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లో 8, అన్నాడీఎంకేలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈలెక్కన ప్రతిపక్షానికి 12 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలన్న ఉద్దేశంతోనే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీని గవర్నర్‌గా నియమించారు. సీఎం నారాయణస్వామి చేత నాలుగు చెరువుల నీళ్లను తాగిస్తూ అధికారాన్ని చెలాయిస్తున్నారు.
ఈ దశలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో ముగ్గురిని నామినేషన్ మీద ఎమ్మెల్యేలుగా నియమించింది. దీంతో ప్రతిపక్షాల బలం 15కు చేరుకుంది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య ఎమ్మెల్యేల వ్యత్యాసం కేవలం మూడు మాత్రమే. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆకర్‡్ష మంత్రం ప్రయోగించినా కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం, ఎన్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అంటున్నారు. గత నెల 26వ తేదీ అమిత్‌షా పుదుచ్చేరిలో రెండురోజులు గడిపి రాజకీయ పావులు కదిపారు. రాష్ట్రపతి ఎన్నికల మద్దతు క్యాంపెయిన్ ముసుగులో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అ«ధ్యక్షులు ఎన్ రంగస్వామిని కలిశారు. నామినేషన్ ఎమ్మెల్యేల నియామకం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూలదోయడమనే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీకి సీఎం
నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి గురువారం ఉదయం హడావుడిగా ఢిల్లీకి పయనమయ్యారు. పుదుచ్చేరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని ఈ సందర్భంగా మీడియాతో సీఎం ధీమా వ్యక్తం చేశారు.