రోహిత్ సోదరుడికి ఢిల్లీలో ఉద్యోగం.. విమర్శలు
న్యూఢిల్లీ: రోహిత్ వేముల సోదరుడు రాజాకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. కారుణ్య నియామకం కింద గ్రేడ్ 4 (నాలుగోతరగతి) ఉద్యోగంలో రాజాను అపాయింట్ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ఉత్తర్వులు జారీచేసింది. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన వేముల రాజాకు నాలుగో తరగతి ఉద్యోగం కల్పించడం అతణ్ని అవమానించడమేనని విమర్శలు చెలరేగుతున్నాయి. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన రాజా 72.8 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం పలు రాజకీయపార్టీలు రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకుంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఓ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమను కలిసినప్పుడు ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ సర్కార్ ఏప్రిల్ 4న నియామక ఉత్తర్వులను వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వజూపిన గ్రేడ్ 4 ఉద్యోగంలో చేరబోయేదీ, లేనిదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వేముల రాజా మీడియాకు చెప్పారు. 'నేను ఏదైనా విదేశీ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేయాలని అన్నయ్య కోరుకునేవాడు. అతని కలల్ని నిజంచేయడమే నాముందున్న కర్తవ్యం'అని తన ఆకాంక్షను వెల్లడించారు రాజా.
అటు నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్)లోనూ అర్హత సాధించిన రాజాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలుండగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఇలా నాలుగోతరగతి ఉద్యోగాన్ని ఆఫర్ చేయడం అతణ్ని అవమానించడమేనని రోహిత్ స్నేహితులు, హెచ్ సీయూ అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత గుమ్మిడి ప్రభాకర్ అన్నారు. పలు సంఘాలు కూడా కేజ్రీ తీరును తప్పుపట్టారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద గ్రూప్ సి, గ్రూప్ డీ తప్ప మరే ఇతర ఉద్యోగాలు కల్పించలేమని, అందుకే విద్యార్హతల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాజాకు గ్రేడ్ 4 ఉద్యోగం కల్పించామని ఢిల్లీ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.